ప్రారంభ‌మైన నిరుద్యోగ దీక్ష.. నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయాల‌ని డిమాండ్‌

BJP Nirudyoga Deeksha starts in Nampally.తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భ‌ర్తీ చేయాల‌నే డిమాండ్‌తో బీజేపీ రాష్ట్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Dec 2021 12:33 PM IST
ప్రారంభ‌మైన నిరుద్యోగ దీక్ష.. నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయాల‌ని డిమాండ్‌

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భ‌ర్తీ చేయాల‌నే డిమాండ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ త‌ల‌పెట్టిన నిరుద్యోగ దీక్ష ప్రారంభ‌మైంది. నాంప‌ల్లిలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో ఈ దీక్షను బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల బాధ్యుడు త‌రుణ్ చుగ్ ప్రారంభించారు. దీక్ష‌లో బండి సంజ‌య్‌తో పాటు విజ‌య‌శాంతి, ఈటల రాజేంద‌ర్‌, స్వామిగౌడ్‌, పొంగులేటి, వివిధ మోర్చాల అధ్య‌క్షులు త‌దిత‌రులు పాల్గొన్నారు. సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు దీక్ష కొన‌సాగ‌నుంది. తొలుత‌ ఇందిరా పార్క్ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద దీక్ష చేప‌ట్టాల‌ని బావించారు. కరోనా ఆంక్షలు రాష్ట్రంలో అమలవుతున్న నేపథ్యంలో పోలీసులు అనుమ‌తికి నిరాక‌రించారు. దీంతో వేదిక‌ను బీజేపీ రాష్ట్ర కార్యాల‌యానికి మార్చారు.

నిరుద్యోగ‌ దీక్షకు భయపడే మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ విడుదల చేశారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం మొద‌లైంద‌ని.. అయితే నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. నిరుద్యోగుల జీవితాల‌తో ప్ర‌భుత్వం ఆట‌లాడుకొంటోంద‌న్నారు. వివిధ ప్ర‌భుత్వం శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు వెంట‌నే నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు. 'నిరుద్యోగ దీక్ష'కు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులను, పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేయడం దుర్గ్మార్గ‌మ‌ని బండి సంజ‌య్ ధ్వ‌జ‌మెత్తారు.

Next Story