హైదరాబాద్ పార్లమెంట్‌లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం : ఎంపీ డా. లక్ష్మణ్

మోదీని మూడో సారి ప్రధాని చేయాలని ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని బీజేపీ ఎంపీ డా లక్ష్మణ్ తెలిపారు.

By Medi Samrat  Published on  28 Feb 2024 3:47 PM IST
హైదరాబాద్ పార్లమెంట్‌లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం : ఎంపీ డా. లక్ష్మణ్


మోదీని మూడో సారి ప్రధాని చేయాలని ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని బీజేపీ ఎంపీ డా లక్ష్మణ్ తెలిపారు. గౌలిపురాలో ఆయ‌న మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రకు గ్రామాల్లో, పట్టణాల్లో ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లీం మహిళలకు అన్నగా నిలిచిన వ్యక్తి మన మోదీ అని కొనియాడారు. హిందువుల కోసం అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేపట్టిన గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోదీ అన్నారు. రాముడే లేదు.. రామునికి గుడి ఎందుకు అన్న కాంగ్రెస్ పార్టీ.. ఇపుడు రాజకీయం కోసం దేవుడి పేరు వాడుకుంటున్నారని విమ‌ర్శించారు.

రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలో.. రామునికి గుడి కట్టిన మోదీ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. కర్ణాటక ఎమ్మెల్సీ నసీర్ షా గెలిచిన సందర్భంగా పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. మన దేశంలో ఉంటూ.. మన దేశ తిండి తింటూ.. మన ప్రజలతో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ కి జిందాబాద్ అనడం సిగ్గు చేటన్నారు. వెంటనే కాంగ్రెస్ అధిష్టానం వాళ్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశం సస్యసామలంగా ఉండాలంటే మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమ‌న్నారు.

నేను ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్య సభ సభ్యుడుగా ఉన్నాను. అక్కడ బీజేపీ సీఎం యోగి అధిత్యనాథ్ గ్యాంగ్ స్టర్స్ మాఫియాను బుల్డోజర్లతో కూల్చేశారని.. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ చాలా ప్రశాంతంగా ఉందన్నారు. అలాగే హైదరాబాద్ లో బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్ కూడా సస్యసామలంగా మారుతుంద‌న్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓవైసీ తొత్తులుగా మారి పాత బస్తీని డెవలప్ జరగకుండా చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్‌, కేసీఆర్‌ కుటుంబం కోసం పని చేస్తుంది.. కాంగ్రెస్ నెహ్రూ కుటుంబం కోసం పని చేస్తుంది.. కానీ బీజేపీ పార్టీ, మోదీ సర్కార్ మాత్రం ప్రజల కోసం దేశం కోసం పని చేస్తుందన్నారు. పాత బస్తీ బాగుపడాలంటే బీజేపీని గెలిపించాల్సిందేన‌న్నారు. ఎక్కడ చూసినా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదం వినిపిస్తుందన్నారు. ఈ సారి హైదరాబాద్ పార్లమెంట్ లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Next Story