టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ చార్జ్‌షీట్

BJP Chargesheet On TRS Government. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫ‌ల్యాల‌పై బీజేపీ చార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ఆదివారం హైదరాబాద్

By Medi Samrat  Published on  22 Nov 2020 2:28 PM IST
టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ చార్జ్‌షీట్

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫ‌ల్యాల‌పై బీజేపీ చార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ఆదివారం హైదరాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ దీనిని విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మేయర్ కావాలా.. ఎంఐఎం మేయర్ కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. హైద్రాబాద్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతుందని జోస్యం చెప్పారు.

కేసీఆర్ ఆరేళ్ళల్లో పాలన అవినీతికి చిరునామా అని.. హైద్రాబాద్‌ను డల్లాస్ నగరం చేస్తామని.. వరదల‌ నగరంగా మార్చారర‌ని ఎద్దేవా చేశారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంద‌ని.. మోదీ రెండున్నర లక్షల ఇళ్ళు నిర్మిస్తే.. కేసీఆర్ రెండు వందల ఇళ్ళు కూడా నిర్మించలేదని ఫైర్ అయ్యారు.

కరోనా సమయంలో ప్రజలను గాలికి వదిలి కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకున్నారని.. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేసి ఉంటే పేదలకు కరోనా చికిత్స ఉచితంగా అందేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర కీలకమైంద‌ని.. సుష్మా స్వరాజ్ లేకపోయినా ఆమె పోరాటం మర్చిపోలేమ‌ని అన్నారు.

కేసీఆర్, ఓవైసీ కుటుంబ పార్టీల నుంచి హైద్రాబాద్‌ను కాపాడుకోవాలని హైదరాబాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లే అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్, హరీష్ నియోజకవర్గాలకు మధ్యలో ఉన్న దుబ్బాకను గెలిచామని.. దుబ్బాక ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం కాబోతోందని ధీమా వ్యకం చేశారు.


Next Story