వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం అని చెప్పడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలే నాంది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గణనీయమైన స్థాయిలో డివిజన్లు గెలుచుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అహంకారంతో విర్రవీగే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నది మరోసారి నిరూపితమైందన్నారు. మొన్న దుబ్బాకలో ఇదే తరహా ఫలితం వచ్చిందని, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటిందన్నారు.
కేసీఆర్ స్వార్థపూరిత, అహంభావ రాజకీయాలకు గ్రేటర్ ఎన్నికలు రిఫరెండంగా భావిస్తున్నామన్నారు. దుబ్బాకలో ముఖ్యమంత్రి అల్లుడి ఇజ్జత్ మీద దెబ్బకొట్టారు, ఇక్కడ భాగ్యనగరంలో ముఖ్యమంత్రి కొడుకు ఇజ్జత్ మీద కొట్టారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి అని వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు చూస్తే.. బీజేపీ 43 డివిజన్లలో నెగ్గి 7 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. అధికార టీఆర్ఎస్ 53 డివిజన్లలో విజయం సాధించి రెండింట ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎంఐఎం 42 డివిజన్లలో విజయం సాధించి 1 డివిజన్ లో ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ 2 డివిజన్లలో మాత్రమే విజయం సాధించింది.