ఒక్కరోజే దాదాపు 500 వివాహాలు.. హైదరాబాద్‌లో మోగుతున్న పెళ్లి బాజాలు

సరైన శుభ ముహూర్తాలు లేకపోవడంతో మూడు నెలల విరామం తర్వాత హైదరాబాద్‌లో మళ్లీ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి.

By -  Medi Samrat
Published on : 22 Feb 2026 1:00 PM IST

ఒక్కరోజే దాదాపు 500 వివాహాలు.. హైదరాబాద్‌లో మోగుతున్న పెళ్లి బాజాలు

సరైన శుభ ముహూర్తాలు లేకపోవడంతో మూడు నెలల విరామం తర్వాత హైదరాబాద్‌లో మళ్లీ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. పాల్గుణ మాసం ప్రారంభం కావడంతో శుభ ముహూర్తాలు మరోసారి వేడుకలకు అనుకూలిస్తాయి. ఈరోజు అంటే ఆదివారం నుండి పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతాయని తెలుస్తుంది. ఈ ఒక్క రోజే GHMC పరిధిలో దాదాపు 500 వివాహాలు జరిగినట్లు పండితులు అంచనా వేస్తున్నారు.

గత సంవత్సరం అక్టోబరు, నవంబర్‌లలో ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాలలో సుమారు 40 శుభ ముహుర్తాలు ఉండ‌టంతో చాలా వివాహాలు, శుభ కార్యక్రమాలు జ‌రిగాయి. అయితే.. గత ఏడాది నవంబర్ 26 నుండి.. సరైన ముహుర్తాలు లేకపోవడంతో వివాహాలు, శుభ కార్యక్రమాలు నిలిచిపోయాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి 25, 28, మార్చి 3, 5, 6, 7, 8, 13, అలాగే ఏప్రిల్ మొదటి మరియు రెండవ వారాల్లో, మే 14 వరకు మంచి ముహుర్తాలు అందుబాటులో ఉన్నాయని పండితులు ధృవీకరిస్తున్నారు. ఆ తరువాత జూన్ 15 వరకు ఎటువంటి శుభ దినాలు లేవు. తల్లిదండ్రులు తమ పిల్లల పేర్ల బలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తేదీల ఆధారంగా వివాహాలు ప్లాన్ చేస్తున్నారు.

ఫిబ్రవరి నుండి మే వరకు దాదాపు 20 శుభ ముహూర్తాలు ఉండడంతో వివాహ వేదికలకు డిమాండ్ పెరిగింది. చాలా మంది ఫంక్షన్ హాల్ యజమానులు తమ రేట్లను గణనీయంగా పెంచారు. కొంతమంది తల్లిదండ్రులు నిర్దిష్ట తేదీలలో వేదికలను బుక్ చేసేందుకు ఇబ్బంది ప‌డుతున్నారు. పూల వ్యాపారులు, డెకరేటర్లు కూడా బిజీగా ఉన్నారు. మొత్తమ్మీద రాబోయే నెలల్లో హైదరాబాద్ అంతటా వివాహ వేడుకలు సందడి చేయబోతున్నాయి.

Next Story