వీళ్ల టార్గెట్ వారే.. ఏటీఎంల వద్ద ఘరానా మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్టు
హైదరాబాద్ నగరంలో ఏటీఎంల వద్ద దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్టు చేశారు.
By - Medi Samrat |
హైదరాబాద్ నగరంలో ఏటీఎంల వద్ద దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.52,000 నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 89 ఏటీఎం కార్డులు, మూడు సెల్‌ఫోన్లు, ఒక ఆటో రిక్షాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో హర్యానాకు చెందిన అమీర్ సుహెల్ @ అమీర్ సోహైల్ @ సోహెల్ (24), ముబారిక్ (26), ముస్తకీమ్(25) తోపాటు హైదరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అమేర్(33)ను అరెస్టు చేశారు. వీరిలో అమీర్ సుహెల్, ముబారిక్‌లను ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు.
డిసెంబర్ 31న ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ అలకుంట వెంకటేష్(38) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 28న మల్లేపల్లి ఎక్స్‌రోడ్స్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లిన బాధితుడు.. చదువు రాకపోవడంతో అక్కడున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల సహాయం కోరాడు. వారు అతని తల్లి ఏటీఎం కార్డు తీసుకుని పిన్ నంబర్ తెలుసుకుని, కార్డును మార్చి ఖాతా నుంచి రూ.40,000 నగదు విత్‌డ్రా చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ముఠా కేవలం చదువురాని వారు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సహాయం చేస్తున్నట్టు నటిస్తూ ఏటీఎం కార్డులు మార్చి డబ్బులు దోపిడీ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా జనవరి 3న ఉదయం విజయ్‌నగర్ కాలనీలోని ఏటీఎం వద్ద నిందితులను మెహిదీపట్నం క్రైమ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అమీర్ సుహెల్‌పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే నాలుగు కేసులు నమోదై ఉండగా.. రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు ముబారిక్ హర్యానాలో ఆటోమొబైల్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన చరిత్ర ఉన్నట్లు వెల్లడించారు.
మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 365/2025 కింద సెక్షన్లు 318(4), 303(2) r/w 3(5) BNS ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, ఏటీఎం కార్డును ఎవరికీ ఇవ్వవద్దని, పిన్ నంబర్‌ను తెలియని వ్యక్తులతో పంచుకోరాదని సూచించారు.