తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పలు రోడ్డు పనులపై అధికారుల నుండి సమాచారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోందని, మరో నెల రోజుల్లో ఓపెన్ చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రాంత వాసుల ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి.
ఫిబ్రవరిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కమిషనర్ రోనాల్డ్ రోస్ అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పురోగతిని పరిశీలించి, పనుల్లో వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నట్లయితే, ఆ బాధ్యత రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్లపై మాత్రమే కాకుండా సంబంధిత అధికారులపై కూడా పడుతుందని మంత్రి అధికారులను హెచ్చరించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు, 4.4 కి.మీ 6-లేన్ హైవే విస్తరణ పనులు 82% పూర్తయ్యాయని, ఓ కిలోమీటరుకు సంబంధించి అటవీ శాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు తెలిపారు.