నటుడు అల్లు అర్జున్ శ్రీతేజ్‌ను కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. అల్లు అర్జున్ పర్యటన కారణంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కిమ్స్ ఆస్పత్రి వద్ద పటిష్ఠమైన చర్యలు చేపట్టారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆస్పత్రి రహదారుల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. ఇతర రోగులకు ఇబ్బంది కలగకుండా ఆస్పత్రి వర్గాలు ఏర్పాట్లు చేశారు.
అయితే అల్లు అర్జున్ శ్రీతేజ్ తండ్రిని కలవడానికి మాత్రం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. డిసెంబర్ 4, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతురాలు రేవతి భర్త భాస్కర్ ని కలిసేందుకు బన్నీని పోలీసులు అనుమతించలేదు. కేసు కోర్టులో ఉన్న కారణంగా రేవతి భర్తను, ఆయన కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించలేదు. కిమ్స్ ఆసుపత్రిలోని 14వ ఫ్లోర్ లోని ఐసీయూలో శ్రీతేజ్ కు చికిత్స అందిస్తున్నారు. శ్రీతేజ్ వద్దకు అల్లు అర్జున్ ని పోలీసులు తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్న వైద్యులతో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి బన్నీ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అల్లు అర్జున్ దాదాపు 20 నిమిషాల పాటు ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తన ఇంటికి చేరుకున్నారు.