హైదరాబాద్ లో ప్రాణాలు తీస్తున్న వాయు కాలుష్యం
Air pollution behind at least 11,000 deaths in Hyderabad last year. భారతదేశంలో కూడా వాయు కాలుష్యం ఇటీవలి కాలంలో
By Medi Samrat Published on 19 Feb 2021 7:48 PM ISTభారతదేశంలో కూడా వాయు కాలుష్యం ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే..! తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను కూడా కాలుష్యం కమ్మేస్తోంది. 2020లో ఒక్క హైదరాబాద్ నగరంలోనే వాయు కాలుష్యం కారణంగా 11వేల మంది మరణించినట్లు తాజా నివేదికలో తెలిసింది. గతేడాది కరోనా లాక్‌డౌన్ కారణంగా కాలుష్యం తగ్గినా వేలల్లో మరణాలు, రూ.వేల కోట్ల నష్టం వాటిల్లిందని గ్రీన్‌పీస్- ఆగ్నేయాసియా తన నివేదికలో తెలిపింది. వాయు కాలుష్యం కారణంగా హైదరాబాద్ నగరం గతేడాది రూ.11,637 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు అంచనా వేసింది. మరణాలకు 'పీఎం 2.5' ఉద్గారాలే కారణమని తేల్చింది. కలుషిత గాలి కారణంగా క్యాన్సర్, బ్రెయిన్‌స్ట్రోక్, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలకు గురై ఎక్కువమంది చనిపోతున్నారని నివేదిక పేర్కొంది.
'టాక్సిక్ ఎయిర్: ది ప్రైజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యుయల్స్' పేరుతో 'సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ)'తో కలిసి చేసిన అధ్యయనం నివేదికను గురువారం వెల్లడించింది. పీఎం 2.5 కాలుష్య భూతం కారణంగా 2020లో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో 1,19,700 మంది ప్రాణాలు కోల్పోయారని ఈ నివేదిక ద్వారా తెలిసింది. దీని కారణంగా జరిగిన మరణాలు, అనారోగ్య సమస్యలతో దేశానికి రూ.1,28,728 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది.
మరణాల్లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిన దిల్లీ.. అంతర్జాతీయంగానూ అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ సహా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో, ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో వాయు కాలుష్యం కలిగించిన నష్టంపై గ్రీన్‌పీస్ అధ్యయనం చేసింది. ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం కారణంగా జరుగుతున్న నష్టం అంచనాలకు మించిపోయిందని స్పష్టం చేసింది. వాయు కాలుష్యం కారణంగా రాబోయే కాలాల్లో మరిన్ని మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తూ ఉన్నారు. అధికారులు, ప్రభుత్వాలు మేల్కోకపోతే కష్టమని ఈ నివేదిక హెచ్చరిస్తూ ఉంది.