జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్...ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఇదే
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది.
By - Knakam Karthik |
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్...ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఇదే
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. ఈ మేరకు ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. అందరూ ఊహించినట్లుగానే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఈ సీటు నుంచి పోటీ చేసే వారి జాబితాలో అనేక మంది పేర్లు అయితే ఇంతకాలం ప్రచారంలో ఉన్నాయి. చాలా మంది పెద్దలు బిగ్ షాట్స్ కూడా ఈ సీటు కోసం పోటీ పడ్డారు అయితే నవీన్ యాదవ్ పేరుని ఖరారు చేయడం ద్వారా ఆ ఉత్కంఠకు కాంగ్రెస్ పెద్దలు తెర దించేశారు.
ఇప్పటికే జూబ్లీ హిల్స్‌లో బీఆర్ఎస్ తన అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ సతీమణి సునీతను ప్రకటించింది. బీజేపీ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది. దాంతో త్రిముఖ పోరు అయితే కచ్చితంగా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వైపు టీడీపీ కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతుందనే ప్రచారం మొదట జరిగినా..తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశం అనంతరం పోటీపై క్లారిటీ వచ్చింది. జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ నిలవడం లేదని ప్రకటించారు. దీంతో వీరి మద్దతు ఎవరికుంటుందనే ప్రచారం జరుగుతోంది.
నవీన్ యాదవ్ నేపథ్యం..
నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేత. ఆయన బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. జూబ్లీ హిల్స్ లో వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అంతే కాదు ముస్లిం సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంటారు. దాంతో ముస్లిం యాదవ్ సామాజిక వర్గాల మధ్య మంచి అనుబంధం ఇక్కడ ఉంది. ఈ కాంబినేషన్ ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ ఎంపిక చేసింది అని అంటున్నారు. 2014, 2018 లలో పోటీ చేసి గణనీయమైన ఓట్లను తెచ్చుకున్న నవీన్ యాదవ్ యువ నేతగా విద్యార్ధి నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు ఆయనకు బలమైన సామాజిక వర్గాల మద్దతు పూర్తిగా ఉంది.
ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (అక్టోబర్ 6) విడుదల చేసింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చే నెల 11న జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈ నెల 13న ఎ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 తుదిగడువు. 22న నామినేషన్ల పరిశీలను ఉంటుంది. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఫలితం వెలువడుతుంది.