ఆదిబట్ల డెంటల్ సర్జన్ కిడ్నాప్ కేసులో 31 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
Adibatla Dental Surgeon Abduction 16 Arrested booked for attempt to murder. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో 24 ఏళ్ల డెంటల్ సర్జన్‌ను అపహరించిన వారిలో 31 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Dec 2022 9:49 AM GMTరంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో 24 ఏళ్ల డెంటల్ సర్జన్‌ను అపహరించిన వారిలో 31 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. "మొత్తం 16 మందిపై హత్యాయత్నం, కిడ్నాప్, నేరారోపణ తదితర కేసులు నమోదు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ (సీపీ) మహేశ్ భగవత్ తెలిపారు. నిందితులందరినీ అరెస్టు చేస్తాం. నేర చరిత్ర కలిగిన నిందితులపై పీడీ యాక్ట్ పెడతాం. త్వరితగతిన విచారణ జరిపి శిక్షను ఖరారు చేస్తాం'' అని మహేశ్ భగవత్ అన్నారు.
డిసెంబర్ 9న రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో వారి ఇంటిని ధ్వంసం చేసి 24 ఏళ్ల వైశాలిని దాదాపు 100 మంది వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కిడ్నాప్‌కు నవీన్ రెడ్డి కారణమంటూ ఆమె తల్లిదండ్రులు ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) పూర్తి చేసిన వైశాలిని 6 గంటల తర్వాత రక్షించారు. తన పెళ్లి ప్రపోజల్ ను అంగీకరించమని నవీన్ రెడ్డి ఆమెను బలవంతం చేస్తున్నాడని వైశాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వైశాలి ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని, అందుకే ఆమెను కిడ్నాప్ చేశాడని తల్లిదండ్రులు తెలిపారు.
ఈ ఘటనలో నవీన్‌రెడ్డి వైశాలి తన భార్య అని, 2021 ఆగస్టులో ఆమెను పెళ్లిచేసుకున్నాని చెప్పడం కలకలం రేపుతోంది. అంతేకాదు బాపట్ల జిల్లా వలపర్ల ఆలయంలో పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. BDS పూర్తయ్యే వరకు ఫొటోలు బయటికి రావొద్దని వైశాలి కండీషన్ పెట్టిందని.. వైశాలి తల్లిదండ్రులు తనతో డబ్బులు ఖర్చు పెట్టించారని, తనకిచ్చి పెళ్లి చేస్తామని మాట తప్పారని నవీన్ ఆరోపించాడు. నవీన్‌తో వైశాలికి వివాహం అయిందనేది అవాస్తవమన్నారు ఆమె తండ్రి దామోదర్‌రెడ్డి. 2021 ఆగస్ట్ 4 వతేదీ వైశాలి డెంటల్ ట్రీట్‌మెంట్ తీసుకుందని, అసలు నవీన్‌తో వైశాలి లేదన్నారు. ఆర్మీ డెంటల్ ఆస్పత్రిలో వైశాలికి చికిత్స చేయించామన్నారు. దానికి సంబంధించిన బిల్స్ అన్ని తమ దగ్గర ఉన్నాయన్నారు. నవీన్‌రెడ్డి కోర్టును, పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నవీన్‌రెడ్డి గతేడాది ఆగస్టు 27వ తేదీన వివాహమైందని ప్రచారం చేసుకున్నాడు. తన భార్యను పంపించడం లేదంటూ ఎల్బీనగర్ కోర్టులో నవీన్‌రెడ్డి పిటిషన్ వేశాడు. ఓ వాహనం కొనుగోలు చేసి అందులో నామినిగా తన భార్యపేరు వైశాలి అని నవీన్‌రెడ్డి రాయించుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ డాక్యుమెంట్ ఆధారంగా కోర్టులో పిటిషన్ వేసినట్లు గుర్తించారు.