Hyderabad: కెమికల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం
దుండిగల్ ఔటర్ సర్వీస్ ఎగ్జిట్ నంబర్ 5 సమీపంలో కెమికల్ ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.
By అంజి Published on 20 July 2024 9:24 AM ISTHyderabad: కెమికల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం
హైదరాబాద్: దుండిగల్ ఔటర్ సర్వీస్ ఎగ్జిట్ నంబర్ 5 సమీపంలో కెమికల్ ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. దుండిగల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శంకరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కారు డ్రైవర్ ఆకుల అక్షయ్ (19), అతని స్నేహితులు అస్మిత్ (19), జస్వంత్, నవనీత్‌లు బాచుపల్లి వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వాళ్ళు కాలేజీ హాస్టల్‌లో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం టీ తాగేందుకు బయటకు వెళ్తున్నామని హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు.
వీరితో అక్షయ్ స్నేహితుడు హరి సురగ్ (19) చేరడంతో ఐదుగురు కారులో దుండిగల్ ఔటర్ సర్వీస్ రోడ్డులో బౌరంపేట వైపు వెళ్తున్నారు. దుండిగల్ ఎగ్జిట్ నంబర్ 5 వద్దకు రాగానే బౌరంపేట నుంచి గండిమైసమ్మ వైపు వెళ్తున్న వర్గిన్ యాసిడ్స్ అండ్ సాల్వెంట్స్ కెమికల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఫలితంగా అక్షయ్, అస్మిత్, హరి అక్కడికక్కడే మరణించారు. జస్వంత్, నవనీత్‌లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దుండిగల్ ఔటర్ సర్వీస్ రోడ్డుపై తొలిసారి విద్యార్థులు వెళ్లడంతో దాని పదునైన వంపులు తెలియలేదు. అక్షయ్ శరీరం కారులో చిక్కుకుపోయింది, బయటకు తీయడానికి గంట సమయం పట్టింది. కెమికల్ ట్యాంకర్ డ్రైవర్ బిర్జు సహాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్ సెక్షన్ 106(1), 125(ఏ) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.