హైదరాబాద్ నగరంలోని రామాంతపూర్‌లో దారుణ ఘటన జరిగింది. నారాయణ కాలేజీలోని ప్రిన్సిపాల్ గదిలో నారాయణస్వామి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఫీజు గురించి ప్రిన్సిపల్ తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని విద్యార్థి ఆరోపించాడు. టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని విద్యార్థి తెలిపాడు. టీసీ ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా, ప్రిన్సిపల్ కనికరించలేదన్నాడు. ఈ క్రమంలో ఇవాళ టీసీ కోసం నారాయణస్వామి కొంతమంది విద్యార్థి సంఘాలతో కాలేజీకి వచ్చాడు.
ప్రిన్సిపల్‌తో మాట్లాడుతుండగా మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. విద్యార్థి నారాయణస్వామి, ప్రిన్సిపల్ సుధాకర రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ప్రిన్సిపల్ రూమ్‌లోనే వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని విద్యార్థి నిప్పంటించుకున్నాడు. అనంతరం ప్రిన్సిపల్‌తో పాటు అక్కడే ఉన్న ఏవో అశోక్‌రెడ్డిని పట్టుకోవడంతో ముగ్గురికి మంటలు అంటుకుని గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్నవారు మంటలను ఆర్పీ వేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. గాయాలపాలైన విద్యార్థి నారాయణస్వామిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో ప్రిన్సిపల్ రూమ్‌లోని సామాగ్రి, ఏసీ మంటలు అంటుకుని కాలిపోయాయి. కుర్చీలు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. నారాయణస్వామి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో విద్యార్థి సంఘాలు కాలేజీ ముందు ఆందోళన చేస్తున్నాయి. కాలేజీ యజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా గాంధీ ఆస్పత్రి దగ్గర ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బోందబస్తు ఏర్పాటు చేశారు.