హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నల్లాలకు మోటార్లు బిగించిన వారిపై జలమండలి చర్యలకు ఉపక్రమించింది. నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగించిన 84 మందికి జరిమానాలు విధించింది. మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్‌ను వాటర్ బోర్డు ప్రారంభించింది. డ్రైవ్‌లో భాగంగా మాదాపూర్‌లో వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. నగరవ్యాప్తంగా 64 మోటార్లు స్వాధీనం చేసుకుని.. 84 మందికి పెనాల్టీ విధించారు.
150 కిలో మీటర్ల నుంచి పెద్ద పంపులు, భారీ పైపుల ద్వారా నగర పౌరులకు జలమండలి నీటి సరఫరా చేస్తోందని అధికారులు తెలిపారు. వాటర్ బోర్డు అందిస్తున్న తాగునీటిని మొక్కలకు, ఫ్లోర్, వాహనాలను కడగడానికి వినియోగించకూడదని సూచించారు. నిబంధలనకు విరుద్ధంగా పలువురు నల్లాలకు మోటార్లు బిగిస్తూ ఉన్నారని, అలాంటి వాళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.