తెలుగు రాష్ట్రాలకు కొత్త న్యాయ‌మూర్తులు

8 Judges Elevated As Chief Justices Of High Courts. ఏపీ, తెలంగాణ‌ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు.

By Medi Samrat  Published on  9 Oct 2021 4:15 PM GMT
తెలుగు రాష్ట్రాలకు కొత్త న్యాయ‌మూర్తులు

ఏపీ, తెలంగాణ‌ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర నియమితులవ‌గా.. తెలంగాణ హైకోర్టు ఛీప్ జ‌స్టిస్‌గా కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌ చంద్ర శర్మ నియమితులయ్యారు. గత నెల 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం పలువురు న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు ఐదుగురు సీజేలను బదిలీ చేయాలని కేంద్రానికి ప్రతిపాదన చేసింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం సిఫార్సులకు శ‌నివారం నాడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్రవేశారు.

కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్ల‌నున్నారు. న్యాయ మంత్రిత్వ శాఖలో న్యాయ శాఖ ప్రచురించిన జాబితా ప్రకారం మేఘాలయకు చెందిన జస్టిస్ రంజిత్ వి మోర్ అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక‌ కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియ‌మితుల‌య్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ వి మాలిమత్ ను మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియ‌మించారు.

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్థీ కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్ల‌నున్నారు. ఇక‌ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్.. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్ల‌నున్నారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుల‌య్యారు. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ ఎ. కురేషి.. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.


Next Story