58 ఏళ్ల మహిళ ప్రాణాలు నిలబెట్టిన 14 నెలల చిన్నారి
14-month-old baby's organ donated.. kidney was transplanted to a 58-year-old woman. అవయవ దానం సాధారణంగా పెద్దలు మాత్రమే చేస్తుంటారు. అయితే చిన్న పిల్లల అవయవాలతో
By న్యూస్‌మీటర్ తెలుగు
హైదరాబాద్: అవయవ దానం సాధారణంగా పెద్దలు మాత్రమే చేస్తుంటారు. అయితే చిన్న పిల్లల అవయవాలతో కూడా ప్రాణాలను కాపాడవచ్చు. హైదరాబాద్ నగరంలో 14 నెలల పాప బ్రెయిన్ డెడ్ కావడంతో పాప తల్లిదండ్రులు తమ బిడ్డ అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. చిన్న పిల్లల అవయవాల పరిమాణం చాలా చిన్నది కావడంతో వృద్ధులకు వాటిని అమర్చడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయని వైద్యులు చెబుతో ఉంటారు. అయితే 58 ఏళ్ల మహిళ గత 7 సంవత్సరాలుగా డయాలసిస్‌పై ఉంది.. అంతే కాకుండా పేస్‌మేకర్ ను అమర్చారు. 14 నెలల పాప నుంచి సేకరించిన కిడ్నీని వృద్ధురాలికి అమర్చారు. అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు, అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం కారణంగా పాప కిడ్నీని వృద్ధురాలికి అమర్చగలిగారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో ఈ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు.
ఈ శస్త్ర చికిత్సకు ప్రముఖ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ , రీనల్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు నాయకత్వం వహించారు. "అవయవ మార్పిడికి సంబంధించిన కేసుల్లో అవయవాల లభ్యత అతిపెద్ద సమస్య. అటువంటి పరిస్థితులో, రోగుల ప్రాణాలను రక్షించడానికి వివిధ రకాల శస్త్రచికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది. వయస్సు, అవయవాల పరిమాణం వంటి అన్ని లిమిట్స్ ను అధిగమించడానికి ఈ శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఇలాంటి శస్త్ర చికిత్సలు ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతూ ఉంటాయి. రోగికి జీవితంపై కొత్త ఆశ చిగురించేలా చేస్తాయి. ఎన్నో విషయాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. సేకరించిన కిడ్నీ సైజు, గ్రహీత శరీరం అంగీకరించే అవకాశం ఎలా ఉంటుందో చూడాలి. మూడేళ్ల వరకు మనిషి శరీరంలో కిడ్నీ పెరుగుతుంది. తర్వాత అది పూర్తిగా పెరిగి క్రియాత్మకంగా ఉంటుంది. మార్పిడి తర్వాత కూడా గ్రహీత శరీరంలో పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కిడ్నీని పెద్దవారికి అమర్చినప్పుడు ధమనులలో త్రంబస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ విషయంలో అలాంటిదేమీ జరగలేదు. చిన్న పాప నుంచి సేకరించిన కిడ్నీని 58 ఏళ్ల రోగికి అమర్చడం సాహసోపేతమైన నిర్ణయం. అన్ని కీలక చర్యలు తీసుకుని.. ఈ సర్జరీని అత్యంత విజయవంతంగా పూర్తి చేయగలిగాం." అని ఉమామహేశ్వరరావు తెలిపారు.
"అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అవయవదానంపై నిర్ణయం తీసుకునేందుకు మృతుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకు రావాలి." అని ఉమామహేశ్వరరావు అన్నారు. అయితే ఆ ఒక్క నిర్ణయం చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది. ఇప్పుడు వైద్య రంగంలో పరిశోధనలు చాలా రెట్లు పెరిగాయి, అవయవాలను భద్రపరచడానికి కొత్త పద్ధతులు వచ్చాయి. కొన్ని సంస్థలు అవయవ దానాలను సమన్వయం చేస్తున్నాయని ఉమామహేశ్వరరావు అన్నారు.