హైదరాబాద్: రెండు గంటల్లో 11 సెంటీమీటర్ల వర్షం
By సుభాష్ Published on 17 Sept 2020 1:26 PM ISTతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ లో మాత్రం కుండపోత వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో కేవలం 2 గంటల్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే వర్షం ఏ మేరకు కురిసిందో తెలిసిపోతుంది. బుధవారం నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం బీభత్సం సృష్టించింది. ఈ భారీ వర్షం కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురు కావడమే కాకుండా వాహనదారులు నడిరోడ్డుపై వాహనాలతో నీటిలోనే చిక్కుకుపోయారు.
భారీ వరదల కారణంగా హకీంపేట, టోలిచౌక్, జూబ్లీహిల్స్, బంజారామిల్స్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. రాజధాని నగరంలో ఎక్కడ చూసినా మోకాళ్లలోతు నీళ్లు నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో వర్షానికి రోడ్లు కుంగిపోయాయి. మరో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పటంతో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవారం మూడు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా నగరమంతా తడిసిముద్దయింది. పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోవడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌లోని పాతబస్తీ బహదుర్‌పురా, చందూలాల్బరాదరిలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఈనెల 20న మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో రాగల ఐదు రోజులు గ్రేటర్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.