కేసీఆర్ 'లంకె బిందె'ను కొట్టేయాలని బీజేపీ స్కెచ్ వేస్తుందా..?!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 1:26 PM GMT
కేసీఆర్ లంకె బిందెను కొట్టేయాలని బీజేపీ స్కెచ్ వేస్తుందా..?!!

ఇంట్లో లంకె బిందెలు దొరికితే.. సైలెంటుగా ఉండాలి గాని అందరికీ చెప్పేస్తే... అనేక ప్రమాదాలు వస్తాయి. అది దేనికైనా దారితీయొచ్చు. ఇపుడు కేసీఆర్ పరిస్థితి అలాగే ఉంది. కేసీఆర్ కి తెలంగాణ ఉద్యమ మూలంగా అధికారం దక్కడం అనేది కష్టానికి ఫలితం .అయితే... హైదరాబాదు దక్కడం లంకె బిందె దొరకడం లాంటిది. ఈ రోజు కేసీఆర్ ఆడే అన్ని ఆటలు చెల్లుతున్నాయంటే...దానికి కారణం హైదరాబాదే.

తెలంగాణ మొత్తం ఆదాయంలో ఒక్క హైదరాబాదే ముప్పావు భాగం సమకూర్చుతుంది. తెలంగాణను మొత్తం పోషించగలిగిన శక్తి హైదరాబాదుకు ఉంది. అయితే... బీజేపీ కూడా కనిపెట్టలేని ఒక విషయాన్ని కేసీఆర్ పసిగట్టాడు. కాకపోతే దానిని అందరికీ తెలిసిపోయేలా చేసుకుని తన కొంపకిందకే నీరొచ్చేలా చేసుకున్నారు. ఈ కథేంటో వివరంగా చూద్దాం.

దక్షిణాదిలో బలపడటానికి, అధికారంలోకి రావడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటక తర్వాత మొదటి లక్ష్యంగా తెలంగాణను పెట్టుకుంది. కేసీఆర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరుతో బీజేపీకి ఒక కొత్త మాస్టర్ ప్లాన్ తట్టింది. కేవలం ఒకే ఒక్క పని చేస్తే... మొత్తం తెలుగు రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకునే అవకాశం తమకు దొరుకుతుంది అనుకుంటున్నారు కాషాయ నేతలు. 2024లో తెలంగాణ మాత్రమే కాదు ఏపీలో కూడా తమ ఆధిపత్యం చూపించాలని కమలనాధులు పెద్ద స్కెచ్చే వేస్తున్నారు. ఆ రహస్యం 'హైదరాబాద్'. ఆ లంకె బిందె 'హైదరాబాద్‌ . ఆ రహస్యమేంటో ..ఆ లంకె బిందె వ్యవహారమేందో చూద్దాం.

హైదరాబాద్‌ను పోగొట్టుకున్నామనే బాధ ఇప్పటికీ ఆంధ్రుల్లో ఉంది. ఇదేం కర్మరా... అంత మంచి రాజధాని అప్పనంగా వెళ్లిపోయింది అని బాధపడని ఏపీ వాడు లేడు. అసలు మనం హైదరాబాదులో గవర్నమెంటు ఉద్యోగం చేయలేము అన్న ఆలోచనే వారికి భయంకరంగా అనిపిస్తోంది. విభజనకు కాంగ్రెస్ ఎంత కారణమో.. బీజేపీకి కూడా అంతే కారణం. అందుకే బీజేపీ ఎన్ని చేసినా వారికి ప్రేమను పంచడానికి ఆంధ్రుడు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఒక్క ఐడియాతో కేసీఆర్ పై పెత్తనం, ఆంధ్రుల ప్రేమ, రెండు రాష్ట్రాల్లో అధికారం దక్కే మార్గం ఒకటి బీజేపీ పెద్దలకు అర్థమైంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయినప్పటికీ..ఇక్కడ చాలా మంది ఆంధ్రుల వ్యాపారాలు ఉన్నాయి. వేల కోట్ల బిజినెస్ చేస్తున్నారు. రామోజీరావు వంటి వారు కూడా కేసీఆర్‌కి తగ్గి ఉన్నారంటే హైదరాబాద్ వలనే. ప్రతి సంపన్నుడికి ఇక అక్రమ, సక్రమ వ్యవహారాలు ఉండటం వల్ల... వాళ్లందరి జుట్టు కేసీఆర్ చేతిలో ఉండిపోయింది. అందుకే ఎన్నికలపుడు జగన్ కి మద్దతు పలికే విధంగా కేసీఆర్ అందరినీ ప్రభావితం చేయగలిగాడు. అంటే హైదరాబాదు అంటే కేవలం ఆదాయం కాదు, ఒక పవర్ సెంటర్. హైదరాబాదు ఎవరి చేతుల్లో ఉంటే... తెలుగు రాష్ట్రాల్లో వారు అనుకున్నది జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకున్న బీజేపీ మాస్టర ప్లాన్ వేసింది. ఆ మాస్టర్ ప్లాన్ తో బీభత్సమైన ఫలితాలను బీజేపీ మాత్రమే పొందనుంది.

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం ద్వారా...ఈ సూపర్ పవర్ ను మోడీ చేతికి వెళ్తుంది. అక్కడితో అసలు కథ మొదలవుతుంది.

రిజల్ట్ 1 - తెలుగు ప్రముఖులు అంతా బీజేపీకి బధ్దులై ఉంటారు. ఏ పార్టీ వారి జుట్టు అయినా బీజేపీ చేతిలోనే ఉంటుంది. ఫండింగ్ తేవడానికి, ఇతర పార్టీల నుంచి నాయకులను ఆకర్షించడానికి హైదరాబాదులోని వారి ఆస్తులను అష్టదిగ్బంధనం చేస్తారు.

రిజల్ట్ 2 - తెలంగాణలోని 35 శాతం భూభాగంతో అసెంబ్లీ ఉండే యూటీగా హైదరాబాదు అవతరిస్తుంది. మిగతా 65 శాతంతో మిగిలిపోయే తెలంగాణ భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోతుంది. అపుడు ఏపీ పౌరుల ఇగో శాటిస్ ఫై చేసి ఇటు హైదరాబాదు అసెంబ్లీలోనూ, అటు ఏపీ అసెంబ్లీలోను బీజేపీ జెండా ఎగరేయవచ్చు.

రిజల్ట్ 3 - కేసీఆర్, టీఆర్ఎస్ కోరలు లేని పాములా మారి బీజేపీ అస్తిత్వానికి తిరుగులేకుండా ఉంటుంది. యూటీ అండతో బీజేపీ భవిష్యత్తులో తెలంగాణలోనూ విస్తరిస్తుంది. ఒకవేళ విస్తరించకపోయినా బాధలేదు. ఎందుకంటే.. గుండె కాయ వంటి హైదరాబాద్ బీజేపీ వాళ్ల చేతిలో ఉంటుంది.

రిజల్ట్ 4 - హైదరాబాద్‌ను యూటీ చేయడం ద్వారా తనకు జాతీయ స్థాయిలో ఇరిటేట్ చేస్తున్న ఎంఐఎం పార్టీని, అసదుద్దీన్ ను ఒక ఆట పట్టించొచ్చు.

రిజల్ట్ 5 - కేంద్ర పాలిత ప్రాంతం కావడం వల్ల... బీజేపీ కేంద్రంలో ఎన్నిసార్లు అధికారంలోకి వస్తే అన్ని సార్లు హైదరాబాదు వారి చేతికి చిక్కినట్టే. దీనివల్ల దక్షిణాదిలో బీజేపీ బలపడటానికి హైదరాబాదు ఒక ప్రయోగ శాల అవుతుంది.

రిజల్ట్ 6 - ఇప్పటికే కేసులతో తన చేతిలో ఉన్న జగన్...హైదరాబాద్‌ ఆస్తులతోనూ మరోసారి చిక్కుతాడు.

రిజల్ట్ 7 - ఆంధ్ర వ్యాపారులు శాశ్వతంగా బీజేపీకి నిధులు సమకూరుస్తారు. దీనివల్ల బీజేపీకి నిధుల కొరత అనే సమస్య ఉండదు.

రిజల్ట్ 8- ఎపుడైతే హైదరాబాద్‌ యూటీ అవుతుందో.. అప్పటి నుంచి ఏపీ ప్రజలు బీజేపీ వైపు చూస్తారు. ఎందుకంటే... హైదరాబాద్ యూటీ ఐతే... తెలంగాణకు, ఏపీకి హైదరాబాదు మీద సమాన హక్కులు వస్తాయి. అపుడు రాబోయే ఏపీ జనరేషన్స్ బీజేపీ వైపు పూర్తిగా తిరిగిపోయి పార్టీ ఇక్కడ బలపడుతుంది.

సో .. హైదరాబాద్‌ను యూటీ చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదని మొదట్లో బీజేపీ వదిలేసింది. హైదరాబాదు చేతికి చిక్కితే... ఎంత ప్రయోజనమో గత ఎన్నికల్లో బీజేపీ నేతలు చూసి అమిత్ షా, మోదీలను అలర్ట్ చేశారట..!.

ఇక ఆలస్యం ఎందుకు... హైదరాబాదును యూటీ చేయడానికి ఎలాంటి సాకులు ఉన్నాయో వెతకమని ఆదేశాలు జారీ కూడా అయ్యాయట..!. ప్రస్తుతానికి బీజేపీ నేతలు హిడెన్‌గా సిద్ధం చేసుకున్న కారణం ఏంటంటే... ఉమ్మడి రాజధాని 10 ఏళ్లు ఉంది కదా. హైదరాబాదు ఒక్కరికే ఇవ్వడం మంచిది కాదు. రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చేసుకున్న ఈ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే అందరికీ హక్కులుంటాయి అనే వాదనను బీజేపీ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ను యూటీ చేస్తే నొప్పి ఎవరికో బీజేపీ నేతలకు బాగా తెలుసు.

  • వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్‌

Next Story