ఆ నటుడు దొంగయ్యాడు...!

By అంజి  Published on  10 Dec 2019 9:29 AM IST
ఆ నటుడు దొంగయ్యాడు...!

హైదరాబాద్‌: నగరంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని బుల్లితెర సీరియల్లో నటించే ఆర్టిస్టుగా గుర్తించారు. పలు టీవీ ఛానెల్లలో ప్రసారమయ్యే సిరీయళ్లలో బలిజ విక్కి అలియాస్‌ విక్కీ భాయ్‌ పోలీస్‌ అధికారి పాత్రలను పోషించాడు. కాగా గత నెల 15న కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భాగ్యనగర్‌ స్నేహసదన్‌ అపార్ట్‌మెంట్‌లో ఆర్టిస్టు విక్కీ భాయ్‌ చోరీకి పాల్పడ్డాడు. సుమారు రూ.12 లక్షల విలువైన బంగారు నగలు అపహరణకు గురికావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు విక్కీ భాయ్‌గా గుర్తించారు.

ఉప్పల్‌ మండలం నాగరం వికాస్‌నగర్‌లో ఆర్టిస్టు విక్కీభాయ్‌ నివాసముంటున్నాడు. నిందితుడిని సోమవారం ఉదయం అతని ఇంట్లోనే అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా బలిజ విక్కి అలియాస్‌ విక్కీ భాయ్‌పై పలు స్టేషన్లలో తొమ్మిది కేసులు, పీడియాక్ట్‌ కూడా నమోదైనట్లు ఏసీపీ సురేందర్‌ రావు తెలిపారు. జైలుకు వెళ్లి వచ్చినా కూడా విక్కీ భాయ్‌ తన బుద్ధి మార్చుకోలేదు. దొంగతనాలకు పాల్పడి అపహరించిన డబ్బును పరిశ్రమలో వెచ్చించి ఆర్టిస్ట్‌గా అవకాశాలకు దక్కించుకున్నాడు. విక్కీ భాయ్‌ని పోలీసులు విచారిస్తున్నారు.

Next Story