కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు.. గజగజ వణుకుతున్న ప్రజలు..!
By Newsmeter.Network
హైదరాబాద్ మహానగరంలో ఆదివారం రాత్రి ఉన్నట్టుండి చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నగర శివారు ప్రాంతాల ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఆదివారం నాడు వింటర్ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తుండడంతో పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు తక్కువ నమోదు అవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పటాన్‌చెరులో 11.1 డిగ్రీలు, కుత్బుల్లాపూర్‌లో 11.4 డిగ్రీలు, షాపూర్‌నగర్‌లో 14.5 డిగ్రీలు, హకీంపేటలో 11.7 డిగ్రీలు, ఉప్పల్‌లో 13.3 డిగ్రీలు, కాప్రాలో 13.7 డిగ్రీలు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 14.1 డిగ్రీలు, బొల్లారంలో 14.2 డిగ్రీలు, జీహెచ్‌ఈఎల్లో 14.3 డిగ్రీలు, రాజేంద్రనగర్లో 14.4 డిగ్రీలు, బేగంపేటలో 14.5 డిగ్రీలు, బాలనగర్‌లో 14.5 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. తేమ గాలులు వీస్తుండడంతో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలికి వణికిపోతున్న ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. సాయంకాలం 6 లేదా 7 గంటల ప్రాంతంలో గ్రామాల్లోని ప్రజలు ముసుగు వేసుకుంటున్నారు. అదిలాబాద్ జిల్లాలోని అర్లిలో కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు చేరుకుంది. మరోవైపు రాష్ట్రంలో రెండు రోజుల పాటు పొడి వాతవరణం ఉండనుందని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. ఉదయం సమయంలో పొగ మంచుతో రోడ్లు కనపడడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. నిర్మల్, జిగిత్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలో చలిగాలులు వీచే అవకాశాలున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి పంజా విసురుతోంది. రానున్న 24 గంటల్లో ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఆదివారం శ్రీనగర్‌లోని దాల్ లేక్‌లో మైనస్ 6.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత్ర వద్ద నీరు గడ్డకట్టింది. హిమచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో చలితీవ్రత ట్యాప్ నీరు సైతం గడ్డ కట్టుకుపోయింది.