గుడ్‌న్యూస్‌.. మెట్రో ప్రయాణ వేళలు పొడిగింపు..!

By అంజి  Published on  15 Dec 2019 10:00 AM IST
గుడ్‌న్యూస్‌.. మెట్రో ప్రయాణ వేళలు పొడిగింపు..!

ముఖ్యాంశాలు

  • హైదరాబాద్‌ మెట్రో రైళ్ల పని వేళల్లో మార్పులు
  • రాత్రి 11 గంటల వరకు నడవనున్న మెట్రో రైళ్లు

హైదరాబాద్‌ నగరంలోకి మెట్రో సంస్థ వచ్చినప్పటి నుంచి గూడ్‌ న్యూస్‌లు చెబుతూ వార్తల్లో నానుతూనే ఉంది. మొన్నటికి మొన్న మెట్రో రైళ్లలో షుగర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను తీసుకువచ్చిన మెట్రో అధికారులు.. అంతకు ముందు హైటెక్‌సిటీ వరకు ఉన్న నాగోల్‌-హైటెక్‌సిటీ కారిడార్‌ను రాయదుర్గం మెట్రో స్టేషన్‌ వరకు పొడిగించారు. దీంతో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. అయితే మెట్రో సంస్థ తాజాగా మరో గూడ్‌ న్యూస్‌ చెప్పింది. మెట్రో రైళ్లు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడవనున్నాయని మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మె కాలంలో మెట్రో ప్రయాణ వేళలను పొడిగించారు. కాగా ఆ ప్రయాణవేళలను యాధావిధిగా కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.

మహానగరం హైదరాబాద్‌లో దాదాపు 1000 సిటీ బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే మెట్రో రైలు పని వేళల్లో మార్పులు చేసినట్టు మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు పని వేళలు పొడిగింపు ద్వారా రాత్రి సమయంలో ప్రయాణికులు త్వరగా ఇళ్లకు చేరుకోవచ్చు. ఉదయం 6.30 గంటల నుంచి మెట్రో స్టేషన్ల నుంచి రైళ్లు ప్రారంభం అవుతాయి. అలాగే రాత్రి 11.50 గంటలకు ఆఖరి స్టేషన్‌కు చేరుకుంటాయి. త్వరలోనే ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ వరకు కూడా మెట్రో రైళ్లు ప్రారంభంకానున్నాయి. దీనికి సంబంధించిన పనులను మెట్రో సిబ్బంది త్వరితగతిన పూర్తి చేస్తున్నారు.

Next Story