హైదరాబాద్‌లో నో లాక్‌డౌన్.. అసలు కారణం ఇదేనా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 July 2020 5:46 AM GMT
హైదరాబాద్‌లో నో లాక్‌డౌన్.. అసలు కారణం ఇదేనా?

అంతకంతకూ పాజిటివ్ కేసులు పెరిగిపోవటంతో హైదరాబాద్ లో కొత్త ఆందోళన పెరుగుతోంది. మొన్నటివరకూ కేసుల విషయాన్ని పట్టించుకోనట్లుగా వ్యవహరించిన వారు ఇప్పుడు అందుకు భిన్నంగా రియాక్టు అవుతున్నారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు స్వచ్ఛందంగా తమ వ్యాపారాల్ని మూసివేయాలన్న నిర్ణయంతో పాటు.. పని గంటల్ని తగ్గించుకోవాలని డిసైడ్ కావటం తెలిసిందే. రోజుకు వెయ్యి.. అంతకు మించి కేసులు నమోదవుతున్న వేళ.. ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ విధిస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. దీనికి తగ్గట్లే ప్రభుత్వ వర్గాల్లోనూ కసరత్తు కనిపించింది.

ఇదిగో లాక్ డౌన్.. అదిగో లాక్ డౌన్ అంటూ ఒకరిద్దరు మంత్రులు సైతం వ్యాఖ్యానించటం కనిపించింది. అయితే.. క్యాలెండర్లో రోజులు గడుస్తున్నా.. లాక్ డౌన్ విధించే దిశగా ప్రయత్నాలు జరగకపోవటం గమనార్హం. ఎందుకిలా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసులు సంఖ్య ఓపక్క పెరుగుతున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ విధిస్తే.. పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని అందులో పాల్గొనేలా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాజిటివ్ బారిన పడిన పోలీసులు కోలుకున్నది లేదు.

పదిహేను రోజులు లాక్ డౌన్ విధిస్తే సరిపోదు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు.. లాక్ డౌన్ ఉపసంహరణ అన్నది దశల వారీగా సాగుతుంది. అదెంత క్లిష్టమైనదో ఇప్పటికే ప్రభుత్వం చూసింది. ఇలాంటివేళ.. లాక్ డౌన్ విధించటం తప్పే అవుతుందన్న అభిప్రాయం పెరుగుతోంది. లాక్ డౌన్ కారణంగా భారీగా ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోసారి అలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదని చెబుతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించినా దాని వల్ల కలిగే ప్రయోజనం తక్కువేనన్న అభిప్రాయాన్ని పలువురు అధికారులు ప్రభుత్వానికి చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. లాక్ డౌన్ విధించాలన్న ఆలోచనను విరమించుకున్నట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వంలోని కీలక విభాగాలైన రెవెన్యూ.. పోలీసు శాఖలకు లాక్ డౌన్ విధింపుపై ఎలాంటి సంకేతాలు రాకపోవటం చూస్తే.. లాక్ డౌన్ విధించే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.

Next Story