సినీ ఫక్కీలో బ‌ట్ట‌బ‌యిలైన‌ రూ.16 కోట్ల స్కామ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Jan 2020 12:58 AM IST
సినీ ఫక్కీలో బ‌ట్ట‌బ‌యిలైన‌ రూ.16 కోట్ల స్కామ్

  • సినీ ఫక్కీలో స్టేట్ బ్యాంకును మోసం చేసిన రెన్ లైఫ్ కంపెనీ
  • బ్యాంకుకు ఫోర్జరీ చేసిన పత్రాలను సమర్పించిన రెన్ లైఫ్
  • స్టేట్ బ్యాంక్ నుంచి రూ.16 కోట్ల ఋణం తీసుకున్న రెన్ లైఫ్
  • వేరే వ్యక్తి పేరును తప్పుగా ఉపయోగించి పక్కా మోసం
  • స్కామ్ లో స్టేట్ బ్యాంక్ అధికారులకూ భాగం
  • నిందితులకు పూర్తిగా సహకరించిన బ్యాంక్ సిబ్బంది
  • సిబిఐ విచారణలో బైటపడ్డ విస్మయం గొలిపే నిజాలు

హైదరాబాద్ : సిబిఐ గురువారం హైదరాబాద్ లోని రెన్ లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల నివాసాల్లో రూ.16 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి సోదాలు చేసింది. అచ్చంగా సినీ ఫక్కీలో ఈ స్కామ్ జరిగినట్టు సిబిఐ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

విశాల్ హీరోగా వచ్చిన అభిమన్యు సినిమాలో (తమిళంలో ఇరుంబు తిరై) విలన్ ఎవరికీ తెలీకుండా పోర్జరీ చేసిన డాక్యుమెంట్లతో ఏ విధంగా బ్యాంకుల్ని మోసం చేసి ఋణాలు తీసుకుంటాడో అచ్చంగా అదే విధంగా ఈ మోసం కూడా జరిగిందని సిబిఐ అధికారులు చెబుతున్నారు.

రెన్ లైఫ్ ల్యాబ్స్ కంపెనీ అల్బుమిన్, ఇమ్యునో గ్లోబులిన్, ఫ్యాక్టర్ 8 లాంటి రక్తానికి సంబంధించిన హిమోఫీలియాను నయం చేసే ఉత్పత్తులను అమ్మే ఈ కంపెనీ అచ్చంగా సినిమాలో చూపించినట్టుగానే కొందరు ఉన్నతాధికారులకు ఎరవేసి స్టేట్ బ్యాంకుకు కన్నం వేసి రూ.16 కోట్ల రూపాయల్ని ఋణాల రూపంలో దోచేసిందని సిబిఐ చెబుతోంది.

ఈ స్కామ్ కి సంబంధించి సిబిఐ ఇప్పటికే మోసపూరితమైన కుట్ర, మోసం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్, ఫోర్జరీ కేసుల్ని నిందితులపై నమోదు చేసింది. పవన్ కుమార్ (రిలేషన్ షిప్ మేనేజర్, మీడియం ఎంటర్ ప్రైజెస్), జె.నాగేశ్వర శర్మ (చీఫ్ మేనేజర్), శశి కుమార్ (ఎస్.బి.ఐ మహబూబ్ గంజ్ బ్రాంచ్ మేనేజర్), రెన్ లైఫ్ ల్యాబ్స్ డైరెక్టర్లు అరుల్ ప్రకాష్ రామకృష్ణన్, మహమ్మద్ అబ్దుల్ అజీజ్ ఇంకా మరికొందరు నిందితులపై పై సెక్షన్లకింద క్రిమినల్ కేసులు నమోదు చేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్మినార్ రీజనల్ మేనేజర్ ఈ స్కామ్ పై సిబిఐకి ఫిర్యాదు చేశారు. రెన్ ల్యాబ్స్ కంపెనీ రూ.16 కోట్ల రూపాయల ఋణాన్ని ఎగ్గొట్టిందని, ఆ కంపెనీకి ఇచ్చిన లోన్ అకౌంట్ మార్చ్ 18, 2019న ఎన్.పి.ఎ అయ్యిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసుకు సంబంధించి కుట్ర, మోసం జరిగిన విధానం

స్కామ్ చేసిన నిందితులు బెంగళూరుకు చెందిన విజయ్ మైసూర్ రాఘవేంద్ర అనే వ్యక్తి పేరును అక్రమంగా వాడుకుని తనని ఈ కంపెనీలో ఒక డైరెక్టర్ గా చేర్చారు. తర్వాత విజయ్ రాఘవేంద్ర తండ్రి చనిపోయాడనీ, లోన్ కోసం వాళ్ల ఫ్యామిలీ ఆస్తుల్ని కొలేటరల్ సెక్యూరిటీగా సమర్పిస్తున్నామంటూ తప్పుడు పత్రాలు సృష్టించారు.

సైఫాబాద్ ఎస్.బి.ఐ బ్రాంచ్ మొదట వీళ్లకు ఆ పత్రాల ఆధారంగా లోన్ ఇవ్వడానికి నిరాకరించింది. మహబూబ్ గంజ్ బ్రాంచ్ నిందితులు సమర్పించిన ఆస్తి పత్రాలను కుదువపెట్టుకుని రూ.16 కోట్ల రూపాయల ఋణాన్ని మంజూరు చేసింది. బెంగళూరు సౌత్ లో ఉన్న మూడెకరాల 30 గుంటల ఖాళీ స్థలాన్ని నిందితులు తప్పుడు పత్రాల ద్వారా కొలేటరల్ సెక్యూరిటీకింద బ్యాంకుకు కుదువపెట్టారు.

నాటి ఎజిఎమ్ (సైబర్ క్రైమ్స్) ఎస్.బి.ఐ ధనరాజనరావ్ అప్పుడు మహబూబ్ గంజ్ బ్రాంచ్ హెడ్ గా ఉన్నారు. ఆయన మధ్యవర్తుల ద్వారా లావాదేవీలు జరిపి లోన్ ప్రపోజల్ ను అంగీకరించారు. కంపెనీ డైరెక్టర్లలో అబ్దుల్ అజీజ్ తోపాటుగా మరో డైరెక్టర్ విజయ్ మైసూర్ రాఘవేంద్ర కూడా వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. కానీ విజయ్ రాఘవేంద్ర వ్యక్తిగతంగా రావడానికి అతని తండ్రి చనిపోయాడనీ, ఆ కారణంవల్ల తనప్పుడు రాడేలడనీ చెప్పి ఓ తప్పుడు మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించారు. లోన్ పత్రాలపై అతికించిన విజయ్ రాఘవేంద్ర ఫోటోలు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్సుల్లో ఉన్న ఫోటోలతో సరిపోలలేదు.

స్టేట్ బ్యాంక్ అధికారులు ధనార్జన రావ్, పవన్ కుమార్ ప్రీ శాంక్షన్ దశలో ఈ తప్పిదాన్ని అసలు గుర్తించనే లేదు. నాగేశ్వర శర్మ, పవన్ అసలు భూమికి యజమానులు ఎవరు అన్న విషయానికి సంబంధించి కెవైసి వెరిఫికేషన్ చెయ్యనే లేదు. ఎమ్.వి.రాఘవేంద్ర తండ్రి చనిపోయాడంటూ సమర్పించిన మరణ ధృవీకరణ పత్రం నిజమైనదా కాదా అన్న విషయాన్నికూడా వాళ్లసలు వైరిఫై చెయ్యలేదు. ఈ కేసులో మరో నిందితుడైన మేనేజర్ సాక్షి శంకర్ బ్రాంచ్ హెడ్ అప్రూవల్ లేకుండానే లోన్ అమౌంట్ ని డిస్బర్స్ చేశాడు.

స్కామ్ బైటపడిన విధానం

అసలైన విజయ్ మైసూర్ రాఘవేంద్ర ఫిబ్రవరి 2, 2019న మహబూబ్ గంజ్ చీఫ్ మేనేజర్ కి తన పేరును తప్పుగా ఉపయోగించుకుని రెన్ లైఫ్ కంపెనీ రూ.16 కోట్ల ఋణాన్ని తీసుకుందని, బ్యాంకును మోసం చేసిందని ఫిర్యాదు చేశారు. లోన్ కోసం తన ఫ్యామిలీ ప్రాపర్టీని కొలేటరల్ సెక్యూరిటీగా చూపిస్తూ బ్యాంకుకు దాఖలు చేసినవి తప్పుడు పత్రాలని ఆయన తను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు ఆ పత్రాల్లో అతికించిన ఫోటోలుకానీ, చేసిన సంతకాలు కానీ, ఇచ్చిన ప్రూఫ్ లు కానీ ఏవీ తనవి కావని రాఘవేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తీవ్రమైన నిర్లక్ష్యం చూపించినందుకుగానూ జె.నాగేశ్వరశర్మని, సాక్షి శంకర్ ని బ్యాంక్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వెంటనే దీనికి సంబంధించి విజిలెన్స్ విజారణకు ఆదేశించారు. విచారణలో ఒరిజినల్ సేల్ డీడ్, మెమొరాండమ్ ఆఫ్ డిపాడిట్ టైటిల్ డీడ్, కామన్ వెల్త్ ఆఫ్ మసాచుయేట్స్ , యుఎస్ఎ నుంచి ఇచ్చిన ఇర్రివోకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, జూన్ 21, 2018న శ్రేయ హాస్పిటల్ ఇచ్చిందంటూ దాఖలు చేసిన డెత్ సర్టిఫికెట్ అన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని తేలింది.

ఎమ్.ఎన్.ఖాజా అనే వ్యక్తి సంస్థలో కీలకమైన వ్యక్తిగా చెలామణీ అవుతాడనీ, అతని కొడుకు అబ్దుల్ అజీజ్ ఫార్మసీ విద్యార్థని, పూర్తిగా ఉద్దేశపూర్వకంగానే ఈ కుట్రంతా చేశారనీ విచారణలో తేలింది. ఖాజా ఫైనాన్షియల్ కన్సల్టెంట్ జానకి రామ శర్మని సంప్రదించి చాకచక్యంగా విజయ్ రాఘవన్ పేరును ఉపయోగించి ఈ కుట్ర చేశారని తేలింది.

ఎవరో గుర్తు తెలియని వ్యక్తిని విజయ్ రాఘవేంద్రగా చూపించి వీరంతా ఈ కుట్ర చేశారు. తర్వాత విజయ్ రాఘవేంద్ర చనిపోయినట్టుగా చూపించి లోన్ అకౌంట్ ఎన్.పి.ఎ అయ్యే విధంగా చేశారు. లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోయినప్పుడు ఆ లోన్ ఎకౌంట్ ఎన్.పి.ఎ అవుతుందని వాళ్లు భావించారు. బ్యాంక్ ఆ లోన్ అకౌంట్ ని ఎన్.పి.ఎగా డిక్లేర్ చేసి క్లోజ్ చేసేస్తుందని గట్టిగానే అనుకున్నారు. కానీ చేసిన మోసం పూర్తిగా బయటపడింది.

మోసపూరితంగా కుట్రచేసి తీసుకున్న రూ.16 కోట్ల ఋణంలో రూ.1.7 కోట్లు రెన్ లైఫ్ కంపెనీ అకౌంట్ కి క్రెడిట్ అయ్యింది. మిగతా సొమ్ము విర్చోవ్ బయోటెక్ అకౌంట్ కి క్రెడిట్ అయ్యింది. విర్చోవ్ అకౌంట్ నుంచి రెన్ లైఫ్ అకౌంట్ కి ఆ మిగతా సొమ్ము క్రెడిట్ అయ్యింది. నిందితులు ఎంత పక్కాగా సినీ ఫక్కీలో ప్లాన్ చేసి స్కామ్ చేసినా అసలైన విజయ్ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో అడ్డంగా బుక్కైపోయారు. స్టేట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సి.బి.ఐ అధికారులు తీగ లాగితే మొత్తం ఈ స్కామ్ కి సంబంధించిన డొంకంతా బైటపడింది.

Next Story