జోక్ కాదు.. జూన్ జోరు సాగితే హైదరాబాద్ సంగతేంది?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jun 2020 2:22 PM GMT
జోక్ కాదు.. జూన్ జోరు సాగితే హైదరాబాద్ సంగతేంది?

అధికారిక గణాంకాలు.. దాని ఆధారంగా వేసే అంచనాల్లోకి వెళితే.. షాకింగ్ అంశాలు బయటకు వస్తాయి. ఏ ప్రధాన మీడియా సంస్థ కూడా ఈ లెక్కల్లోకి పోకుండా.. ప్రజల్ని హెచ్చరించే విషయంలో తప్పు చేస్తుందా? అన్న సందేహం రాక మానదు. తెలంగాణ రాష్ట్రం సంగతి ఎలా ఉన్నా.. హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఆదివారం ఒక్కరోజులో నమోదైన కేసులు అక్షరాల 816. వందలకువందల కేసులు రోజూ వినటం కారణంగా.. ఈ అంకెలు పెద్దగా భయపెట్టని పరిస్థితి. ఇక్కడే తప్పు జరిగిపోతోంది. ఎందుకంటే.. అపాయాన్ని తప్పించుకోవాలంటే అప్రమత్తత చాలా అవసరం. అది ప్రభుత్వాల్లోనే కాదు.. ప్రజల్లోనూ ఉండాలి. బ్యాడ్ లక్ ఏమంటే.. ఇప్పుడీ అంశం ఇద్దరిలోనూ మిస్ అవుతుందన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ మహానగరంలో జూన్ మొదటి వారంలో నమోదైన కేసులు ఎన్నో తెలుసా? అక్షరాల 767. ఈ అంకెను కాస్త జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. రెండో వారం పూర్తి అయ్యేసరికి నగరంలో పాజిటివ్ లు నమోదైన కేసులు ‘‘968’’. మొదటి వారానికి రెండో వారానికి మధ్య దగ్గర దగ్గర పాతిక శాతానికి కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఇక.. మూడో వారంలోకి అడిగి పెట్టి.. నమోదైన కేసుల లెక్క చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. మూడో వారం ముగిసే సమయానికి.. ఆ ఒక్క వారంలో నమోదైన కేసులు ఎన్నో తెలుసా? ‘‘2316’’. ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే.. రెండో వారం నుంచి మూడో వారానికి పెరిగిన కేసులు దగ్గర దగ్గరగా 2.4 రెట్లు ఎక్కువ.

ఇదంతా ఒక ఎత్తు అయితే నాలుగో వారంలోని ఏడు రోజులు పూర్తి అయ్యేసరికి ఆ ఒక్క వారంలో హైదరాబాద్ లో నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నో తెలుసా? అక్షరాల ‘‘5299’’ కేసులు. అంటే.. మూడో వారంతో పోల్చినప్పుడు నాలుగో వారంలో పెరిగిన కేసుల శాతం 2.3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ లెక్కన రాబోయే రెండు నెలలు ఇదే రీతిలో కేసులు నమోదు కావటం జరిగితే.. రెండునెలల తర్వాత.. అంటే ఆగస్టు చివరి నాటికి నమోదయ్యే కేసులు ఎన్ని ఉండే అవకాశం ఉందన్న విషయాన్ని పేపర్ మీద లెక్కలు వేయటం మొదలుపెడితే గుండెల్లో భయం తన్నుకు రావటం ఖాయం.

మిగిలిన లెక్కల్ని పక్కన పెట్టేసి.. గడిచిన మూడు వారాలుగా సరాసరి రెండు రెట్లు పెరిగే దానినే ప్రాతిపదికగా తీసుకొని లెక్కించటం మొదలు పెడితే.. గొంతులో తడి ఆరిపోవటం ఖాయం. మొన్నటితో (జూన్ 22-28) ముగిసిన వారానికి లెక్క తీసుకుంటే నమోదైన కేసుల సంఖ్య 5299. జులై నెలకు వద్దాం. వారం లెక్కలోకే వెళదాం. 5వేలనే తీసుకొందాం. నమోదైన కేసుల్ని కాస్త తక్కువ కేసులు తీసుకుందాం. ఎందుకంటే.. లెక్క వేసుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. జులై మొదటి వారం ముగిసేసరికి ఇప్పటి లెక్క ప్రకారం పదివేల కేసులు అవుతాయి. జులై రెండో వారానికి రెండు రెట్లు చొప్పున 20 వేల కేసులు అవుతాయి. జులై మూడో వారానికి నమోదయ్యే కేసులు దగ్గర దగ్గర 40వేలకు పైనే. పైన చెబుతున్న లెక్కల్ని ఏ వారానికి ఆ వారం కూడితే ఆ పేషెంట్ల సంఖ్య మరింత భారీగా ఉంటుంది.

జులై నాలుగో వారం ముగిసేసరికి 80 వేల కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక.. ఆగస్టులోనూ జూన్ జోరునే సాగిస్తే (వారానికి వారం రెండు రెట్లు).. మొదటివారం పూర్తి అయ్యే నాటి 1.6లక్షల పాజిటవ్ కేసులు నమోదవుతాయి. రెండో వారానికి వచ్చేసరికి 3.2 లక్షలకు చేరుకునే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు. మూడో వారానికి వచ్చేసరికి 6,8లక్షల కేసులు నమోదయ్యే డేంజర్ ఉంది.

ఇక.. ఆగస్టు చివరి వారంలో ఏకంగా 13లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని చెప్పాలి. కాకుంటే.. ఇదంతా కూడా ఇప్పుడున్న పరిస్థితి ఇదే ఊపులో వైరస్ వ్యాప్తి చెందితే? ఏమిటన్నది అసలు సమస్య. ఈ సందేహాలు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వంగా సిద్ధం లేదన్న మాట వినిపిస్తోంది. కేసుల వ్యాప్తికి కీలక నిర్ణయం తీసుకుంటే తప్పించి హైదరాబాద్ లో నమోదయ్యే అన్నేసి వేల కేసుల్ని డీల్ చేయటం ఎలా సాధ్యమన్నది అసలు ప్రశ్న. ఇదంతా చూసినప్పుడు ఇప్పుడు నడుస్తున్న కాలం మంచిగా అనిపించక మానదు. ఏతావాతా చెప్పేదేమంటే.. జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. అనవసరంగా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Next Story