మహానగరంలో మరో అద్భుత కట్టడం...
By Newsmeter.Network Published on 8 Dec 2019 10:14 AM GMTముఖ్యాంశాలు
- దేశ జాబితాలో భాగ్యనగరం
- రూ. 184 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం
- కాంక్రీట్ విధానంలో నిర్మించిన బ్రిడ్జిల్లో ప్రపంచంలో ఇదే పొడవైనది
- విద్యుద్దీపాల కోసం రూ.11 కోట్ల ఖర్చు
- మరో పర్యాటక కేంద్రంగా మారనున్న 'దుర్గం చెరువు'
హైదరాబాద్ మహా నగరంలో మరో సుందర కట్టడం నిర్మితమైంది. ఇప్పటిదాకా దేశంలో కోల్‌కతా, ముంబాయి, రాజస్థాన్‌లోని కోటా వంటి కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమైన తీగల వంతెన ఇకపై హైదరాబాద్‌లోనూ రూపుదిద్దుకుంది. దుర్గం చెరువుపై నిర్మించిన ఈ ఇంపైన నిర్మాణం ప్రారంభమైతే ఈ ప్రాంతం నగరంలో మరో పర్యాటక ప్రదేశంగా మారుతుందనే చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్. ఇకపై ఈ జాబితాలో కేబుల్ బ్రిడ్జి కూడా చేరనుంది.
పూర్తయిన కేబుల్ బ్రిడ్జి పనులు:
దుర్గం చెరువుపై నిర్మిస్తున్న ఈ కేబుల్ బ్రిడ్జి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ వంతెన మొత్తం 53 సెగ్మెంట్లను ఏర్పాటు చేసేందుకు 22 నెలల సమయం పట్టిందని అధికారులు వివరిస్తున్నారు. సెగ్మెంట్లలో చివరి ఘట్టం సందర్భంగా నిర్మాణ టీమ్ ఆనందంతో బాణసంచా కాల్చారు.
వంతెనకున్న ప్రత్యేకతలు ఇవే:
దుర్గం చెరువుపై నిర్మిస్తున్న ఈ తీగల వంతెన మొత్తం పొడవు 755 మీటర్లు. ఆరు లైన్ల వెడల్పుతో దీన్ని నిర్మాణం చేశారు. అంటే సుమారు వెడల్పు 26 మీటర్లు ఉండనుంది. వంతెనకు ఆధారం రెండు భారీ స్తంభాలు ఏర్పాటు చేశాఉ. ఈ పైలాన్‌ల ఎత్తు 57 మీటర్లు కాగా, వీటి మధ్య దూరం 233.8 మీటర్లు. ప్రపంచంలోనే పొడవైన స్పాన్‌లు కలిగిన కేబుల్ వంతెనలు జపాన్‌లో రెండు 275 మీటర్లు, 271 మీటర్లు ఉండగా, హైదరాబాద్‌లో నిర్మిస్తున్నది మూడోదని జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు పేర్కొంటున్నారు. దీని స్పాన్ 234 మీటర్లు. స్టీల్ లేకుండా ఎక్స్‌ట్రా డోస్డ్ కేబుల్ స్టే ప్రీకాస్ట్ కాంక్రీట్ విధానంలోనిర్మించారు. కాగా, కాంక్రీట్ విధానంలో నిర్మించిన బ్రిడ్జిల్లో మాత్రం ప్రపంచంలో ఇదే పొడవైనదని తెలుస్తోంది. దుర్గం చెరువుపై ఎక్స్‌ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జి పనులు 21వ శతాబ్దపు ఇంజినీరింగ్ అద్భుతంగా ఇంజినీర్లు అభివర్ణించారు.
రూ. 184 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం
ఈ బ్రిడ్జి నిర్మాణం నగర పాలక సంస్థ రూ.184 కోట్ల వ్యయంతో చేపట్టింది. దీని ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ వంతెనను నిర్మిస్తోంది. వంతెనను సుందరీకరణకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.11 కోట్ల ఖర్చు కానున్నట్లు సమాచారం. ఈ విద్యుత్ దీపాలను చైనా నుంచి దిగుమతి చేసుకోనున్నారు. వంతెనపై ప్రహరీ నిర్మాణానికి రూ.15 కోట్లు అవుతుందని అంచనా.
ఇంకా చేయాల్సిన పనులు:
వంతెన పూర్తి కావడానికి మరికొన్ని పనులు మిగిలి ఉన్నాయి. ఫినిషింగ్ పనులతో పాటు రెయిలింగ్, ప్రత్యేక విద్యుదీకరణ తదితర పనులు చేయాల్సి ఉంది. అన్ని పనులు పూర్తయి వినియోగంలోకి రావాలంటే ఇంకా నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బ్రిడ్జి పూర్తయితే సిగ్నల్స్ లేని ప్రయాణం...
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చినట్లయితే జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ఐకియా స్టోర్ వరకు సిగ్నళ్లు లేని ప్రయాణం సాధ్యపడనున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ మార్గంలో 2 కిలోమీటర్ల వరకూ దూరం తగ్గడంతోపాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, మాదాపూర్ మార్గాలపై ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.