మట్టి పాత్రలో 1000 సంవత్సరాల నాటి బంగారు నాణేలు దొరికాయి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Aug 2020 11:23 AM GMT
మట్టి పాత్రలో 1000 సంవత్సరాల నాటి బంగారు నాణేలు దొరికాయి

సెంట్రల్ ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ కు చెందిన యువకులకు జాక్ పాట్ తగిలింది. సెంట్రల్ ఇజ్రాయెల్ లో బిల్డింగ్ ను కట్టడం కోసం యువకులు త్రవ్వుతూ ఉండగా వారికి ఓ మట్టి పాత్ర కనిపించింది.. ఆ మట్టి పాత్ర బద్దలవ్వగా అందులో నుండి బంగారు నాణేలు బయటపడ్డాయి. 1000 సంవత్సరాల కిందటి బంగారు నాణేలు అని చెబుతూ ఉన్నారు.

ఆగష్టు 18 న ఈ నిధి దొరికిందంటూ ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అధికారులు సోమవారం నాడు మీడియాకు తెలిపారు. కొందరు టీనేజర్లు ఇజ్రాయెల్ లో ఇంటి కోసం త్రవ్వకాలు జరుపుతూ ఉండగా ఓ మట్టి పాత్ర కనిపించింది. ఆ మట్టి పాత్రను దాచిపెట్టి దాదాపు 1100 సంవత్సరాలు అయిందని ఎక్స్కవేషన్ డైరెక్టర్ లియాత్ నాదవ్ జివ్ తెలిపారు. మట్టి పాత్రను తిరిగి దక్కించుకోవాలని అప్పుడెవరైతే దాచి పెట్టారో చాలా భద్రంగా దాచినట్లు తెలుస్తోంది.. కానీ ఎందుకో తిరిగి తీసుకోలేకపోయారు. అప్పట్లోనే ఆ ప్రాంతంలో చాలా ఇల్లు ఉండేవని.. ఆ నిధికి యజమాని ఎవరో కనుక్కోవడం చాలా కష్టమని చెబుతున్నారు.

ఆజ్ కోహెన్ అనే యువకుడు కూడా ఈ నిధిని కనిపెట్టిన యువకుల్లో ఉన్నాడు. ఆ నిధిని చూడగానే తనకు ఎంతో ఆశ్చర్యం వేసిందని చెప్పుకొచ్చాడు. తవ్వుతూ ఉండగా ఏదో ఒక వస్తువు కింద ఉన్నట్లు గమనించామని.. తీరా చూస్తే అందులో బంగారు నాణేలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు కోహెన్. పురాతన సంపదను కనుక్కోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.

ఈ నాణేలు తొమ్మిదో శతాబ్దానికి చెందినవిగా భావిస్తూ ఉన్నారు. అబ్బాసిద్ ఖలీఫా పాలనకు సంబంధించిన బంగారు నాణేలుగా చెబుతూ ఉన్నారు. మొత్తం 425 బంగారు నాణేలు.. 24 కేరట్ల క్వాలిటీ అని చెబుతున్నారు. ఈ నిధిని దాచిన వ్యక్తులు అప్పట్లోనే దీన్ని వినియోగించి ఈజిప్టు రాజధానిలో పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చని చెబుతున్నారు.

Next Story