పది ఆస్పత్రులు తిరిగా.. ప్రాణం పోతుందన్నా పట్టించుకోలేదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2020 1:51 PM GMT
పది ఆస్పత్రులు తిరిగా.. ప్రాణం పోతుందన్నా పట్టించుకోలేదు

జ్వరమొచ్చిన భార్యను వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లితే వైద్యులు పట్టించుకోలేదు. రాత్రంగా ప్రైవేట్‌ ఆస్పత్రులన్ని తిరిగాడు ఆ భర్త. ఏ ఒక్క ఆస్పత్రిలోనూ చికిత్స చేయలేదు. ఏ ఆస్నత్రిలో ఏ ఒక్క వైద్యుడు కూడా ఆమెను పరీక్షించలేదు. వైద్యం చేయలేదు. దీంతో ఆ ఇల్లాలు ప్రాణాలు విడిచింది.

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌కు చెందిన రోహిత(41) సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో మృతి చెందిందని ఆమె భర్త శ్రీకాంత్‌ ఆరోపించాడు. వారం క్రితం రోహిత జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే స్థానికంగా ఉన్న ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయినప్పటికి తగ్గకపోవడంతో.. ఈ నెల 17న రాత్రి ఆమె భర్త శ్రీకాంత్ ఆమెను తీసుకొని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లాడు. అయితే అక్కడ రోహితకు కరోనా లక్షణాలున్నాయని ట్రీట్మెంట్ చేయలేదు. దాంతో ఆమెను తీసుకొని శ్రీకాంత్ మరో హాస్పిటల్ కు వెళ్లాడు. అక్కడ కనీసం ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టకముందే.. రోజుకు లక్ష నుంచి రెండు లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. దాంతో శ్రీకాంత్ తన భార్యను మరో హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. వారు కూడా ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోలేదు కానీ, కాసేపు ఆక్సిజన్ పెట్టి పంపించారు. మరో రెండు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లినా అదే పరిస్థితి.

దాంతో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. వెంటిలేటర్, బెడ్స్ లేవని చెప్పి తిప్పి పంపారు. ఇక చివరగా గాంధీ ఆస్పత్రికి వెళ్తే.. కరోనా అనుమానితులు ఇక్కడకు రాకూడదన్నారు. ఇలా శ్రీకాంత్ తన భార్యను తీసుకొని బుధవారం రాత్రి 11 నుంచి గురువారం ఉదయం వరకు దాదాపు పది ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. కానీ ఎక్కడా ఆమెకు వైద్యం అందలేదు. దాంతో చివరకు మళ్లీ శ్రీకాంత్.. తన భార్య రోహితను తీసుకొని గాంధీకి చేరాడు. అక్కడికి వచ్చిన కాసేపటికే రోహిత మృతిచెందింది. తన భార్య చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని శ్రీకాంత్ ఆరోపిస్తున్నాడు. ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లినప్పుడు ఎక్స్‌రే తీశారని, అక్కడే ఆక్సిజన్‌ పెట్టి వెద్యం చేస్తే తన భార్యకు నమమయ్యేదని వాపోయాడు. ఓ స్నేహితుడు చెప్పిన సూచనతో కూకట్‌పల్లితోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్తే అక్కడ కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయని సగం వైద్యం చేసి డొక్కు అంబులెన్స్‌లో గాంధీకి పంపించారన్నారు.

కాగా.. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ అధికారి విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకునే విదంగా ఆదేశించాలని మానవహక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు అయ్యింది.

Next Story