ప్రగతిభవన్‌ వద్ద హోంమంత్రిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారా.!

By అంజి  Published on  2 April 2020 3:58 AM GMT
ప్రగతిభవన్‌ వద్ద హోంమంత్రిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారా.!

హైదరాబాద్‌: హోంమంత్రి మహమూద్‌ అలీకి బుధవారం ప్రగతి భవన్‌లో చేదు అనుభవం ఎదురైందని తెలిసింది. సీఎం కేసీఆర్ క్యాంప్‌ కార్యాలయంలోకి ఆయనకు నేరుగా అనుమతి లభించలేదు. నిన్న సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై అధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసీఆర్‌ సమావేశంలో ఉన్న సమయంలోనే మహమూద్‌ అలీ ప్రగతిభవన్‌కు వచ్చారు. అయితే ఆయనను ప్రగతి భవన్‌ భద్రతా సిబ్బంది.. ప్రవేశద్వారం వద్దనే నిలిపివేశారని తెలిసింది. కొంతసేపు అక్కడే ఉన్న మహమూద్‌ అలీ.. అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ప్రగతిభవన్‌లోకి ఎవరినీ అనుమతించరాదని ఆదేశాలున్నాయని తెలుస్తోంది. మహమూద్‌ అలీ వచ్చిన విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొందేలోగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Also Read: ఏపీలో అమాంతం పెరిగిన కరోనా కేసులు

బుధవారం సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే తనను ప్రగతిభవన్‌లోకి అనుమతించలేదని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని హోంమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మహమూద్‌ అలీ కార్యాలయ అధికారి ఒక ప్రకటన విడుదల చేసినట్లు తెలిసింది. సీఎంను కలిసేందుకు హోంమంత్రి వెళ్లారని.. అయితే అదే సమయంలో కేసీఆర్‌ గవర్నర్‌ తమిళ సైని కలవాలని అనుకోవడంతో హోంమంత్రి వెనక్కు వచ్చారని వివరించారు. సీఎంని కలుసుకోవడంలో హోంమంత్రి మహమూద్‌ అలీకి ఏనాడు ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదని పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో భద్రతా సిబ్బంది ఆయనను అడ్డుకోలేదని తెలిపారు.

Also Read: కరోనా వచ్చినా వదలని టిక్‌టాక్‌ పిచ్చి

Next Story