ఏపీలో అమాంతం పెరిగిన కరోనా కేసులు

By అంజి  Published on  2 April 2020 2:53 AM GMT
ఏపీలో అమాంతం పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఒక్కసారిగా 67 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం రాత్రి 9 గంటల వరకు 44 కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా.. బుధవారం రోజున ఆ సంఖ్య 111కు చేరింది. కరోనా బాధితుల సంఖ్య అమాంతం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు, వారి కుటుంబ సభ్యుల వల్లే కరోనా వైరస్‌ కేసులు పెరిగాయని అధికారిక సమాచారం. విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో ఉన్నవారిలోనూ కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్నవారి కోసం ప్రభుత్వ యంత్రాంగం జల్లెడ పడుతోంది. ఇలాంటి వారిని 1,085 మందిని గుర్తించామని సీఎం జగన్‌ తెలిపారు. మరో 21 మందిని గుర్తించాలని ఆయన ప్రకటించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 1313 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 111 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఢిల్లీ నుంచి వచ్చిన 543 మందికి, అలాగే వారి సన్నిహితులు 269 మందికి వైద్యులు పరీక్షలు చేశారు. విదేశాల నుంచి వచ్చిన 218 మందితో పాటు మరో 140 మందికి వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించి వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు.

జిల్లాల వారీగా..

అనంతపురం 2, చిత్తూరు 6, తూర్పు గోదావరి 9, గుంటూరు 20, కడప 15, కృష్ణా 15, కర్నూలు 1, నెల్లూరు 3, ప్రకాశం 15, విశాఖ 11, పశ్చిమ గోదావరి 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Next Story
Share it