కర్ణాటకలో కాంగ్రెస్‌కు షాక్.. సహకార మంత్రి రాజీనామా
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఆ రాష్ట్ర మంత్రి కేఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు.
By Knakam Karthik
కర్ణాటకలో కాంగ్రెస్‌కు షాక్.. సహకార మంత్రి రాజీనామా
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఆ రాష్ట్ర మంత్రి కేఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని లేఖలో పేర్కొనట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందని.. బెంగళూరు సెంట్రల్ వంటి కీలక నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి ఓట్ల చోరీయే కారణమని ఆరోపించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను మంత్రి రాజన్న వ్యతిరేకించారు. దీంతో రాజన్నపై అటు కాంగ్రెస్ అధిష్టానం, ఇటు డీకే శివకుమార్ వర్గం తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలో ఆయన తప్పక రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. హసన్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పదవి నుంచి రాజన్నను తొలగించిన కొద్దిసేపటికే ఈ పరిణామం జరిగింది. ఈ చర్య నాయకత్వం అసంతృప్తికి సంకేతంగా విస్తృతంగా భావిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజన్న చేసిన వ్యాఖ్యలు తక్షణ ప్రేరణగా కనిపిస్తున్నాయి, బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం పరిధిలోని మహదేవపుర వంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్ల రిగ్గింగ్‌ను ఎన్నికల సంఘం పట్టించుకోలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజన్న బహిరంగంగా ఈ వాదన యొక్క విశ్వసనీయతను ప్రశ్నించాడు, "ఓటరు జాబితా ఎప్పుడు తయారు చేయబడింది? అది మన సొంత ప్రభుత్వం ఉన్నప్పుడు తయారు చేయబడింది. అప్పుడు అందరూ కళ్ళు మూసుకున్నారా?" అని అడిగాడు.