హిరణ్యకశ్యప.. రాజీ పడేదే లేదు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 July 2020 10:14 AM GMT
హిరణ్యకశ్యప.. రాజీ పడేదే లేదు

హిరణ్యకశ్యప.. మూణ్నాలుగేళ్లుగా చర్చల్లో ఉన్న సినిమా. ‘రుద్రమదేవి’ లాంటి సాహసోపేత సినిమా తీసిన గుణశేఖర్.. దాని తర్వాత ‘హిరణ్య కశ్యప’తో అంతకుమించిన రిస్క్ చేయడానికి రెడీ అయ్యాడు. ‘రుద్రమదేవి’లో ఓ కీలక పాత్ర చేసిన రానాను పెట్టి ‘భక్త ప్రహ్లాద’లో హైలైట్‌గా నిలిచిన హిరణ్యకశ్యపుడి పాత్రనే తీసుకుని ‘బాహుబలి’ స్థాయిలో భారీ చిత్రం చేయాలని తలపోశాడు గుణ. అతడికి రానా దగ్గుబాటి రూపంలో పాత్రకు సరిపోయే నటుడు దొరికాడు. రానా తండ్రి సురేష్ బాబు భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించడానికీ ముందుకొచ్చాడు.

ఐతే కేవలం ప్రి ప్రొడక్షన్ పనులకే రూ.15 కోట్ల దాకా ఖర్చు కాగా.. సినిమా మొత్తం పూర్తి చేయడానికి రూ.200 కోట్లు అవుతుందన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కోటి రెండు కోట్లలో సినిమాలు లాగిస్తున్న సురేష్ బాబు రానా, గుణల మీద భరోసాతో అంత ఖర్చు చేస్తాడా అన్న సందేహాలు కలిగాయి.

ఈ సందేహాలకు తోడు కరోనా మహమ్మారి వచ్చి పరిశ్రమకు పెద్ద బ్రేక్ వేసిన నేపథ్యంలో ‘హిరణ్య కశ్యప’ అసలుంటుందా అనే అనుమానాలు కలిగాయి. కానీ ఆ వార్తల్ని ఖండిస్తూ ఇటీవలే గుణశేఖర్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. సినిమా కచ్చితంగా ఉంటుందన్నాడు. ఇప్పుడు సురేష్ బాబు సైతం ఈ సినిమా విషయంలో స్పష్టమైన ప్రకటన చేశాడు. ‘హిరణ్యకశ్యప’ను తమ సంస్థే నిర్మిస్తుందని.. అలాగే ఈ సినిమా బడ్జెట్ విషయంలో కోతలు విధిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

కొన్ని సినిమాలు భారీగానే తీయాలని.. అలా తీస్తేనే అనుకున్న ఔట్ పుట్ వస్తుందని.. అలా తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వచ్చి సినిమాను ఆస్వాదిస్తారని ఆయనన్నారు. మొత్తానికి ‘హిరణ్య కశ్యప’ను ఏమాత్రం రాజీ లేకుండా నిర్మించబోతున్నామని సురేష్ బాబు స్పష్టం చేశారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 వాళ్లతో కలిసి సురేష్ ఈ సినిమాను నిర్మిస్తారని అంటున్నారు.

Next Story