రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై హైకోర్ట్ సీరియస్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Jun 2020 7:41 PM ISTతెలంగాణలో వైద్య సిబ్బందికి తగిన కరోనా నివారణ కిట్లు ఇవ్వడం లేదన్న పిల్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయమై పీపీఈ కిట్లు, మాస్కులు ఎన్ని వచ్చాయి? సిబ్బందికి ఎన్ని ఇచ్చారో నివేదికలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రేపటిలోగా వివరాలివ్వాలని గాంధీ, నిమ్స్, ఫీవర్, కింగ్ కోఠి ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లను కోరింది. అలాగే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, గాంధీ సూపరింటెండెంట్‌లను విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
ఇదిలావుంటే.. గాంధీలో జూడాలు సమ్మె చేయడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోందన్న హైకోర్టు.. రాష్ట్రంలోని 33 జిల్లాలకు కరోనా విస్తరించిందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి మరింత దారుణంగా మారుతోందన్న హైకోర్టు.. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనే సన్నద్ధత తగినంతగా కనిపించడం లేదని సీరియస్ అయ్యింది. ఇక కరోనా మహమ్మారి నియంత్రణపై ప్రభుత్వానికి ఆసక్తి, ఉత్సాహం పోయిందని.. ప్రజలే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలన్న ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని 3 వారాలుగా ప్రభుత్వాన్ని కొరుతూనే ఉన్నామన్న హైకోర్టు.. కరోనా చికిత్సలు గాంధీకే ఎందుకు పరిమితం చేశారని.. నిమ్స్ వంటి ఆస్పత్రులను ఎందుకు వినియోగించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా విషయంలో హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. ఆ విషయంలో మరింత కఠినంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటే.. అలాగే ఉంటామని హెచ్చరించింది.
అలాగే.. కంటైన్ మెంట్ ప్రాంతాల్లో ఇంటింటికీ పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు.. పరీక్షలు తక్కువ చేస్తే కరోనా వ్యాప్తి తీవ్రత ఎలా తెలుస్తుందని సీరియస్ అయ్యింది. అలాగే.. మీడియా బులెటిన్లలో కూడా కరోనా గణాంకాలు గజిబిజిగా ఉంటున్నాయని హైకోర్టు పేర్కొంది.