వికారాబాద్‌లో విషాదం.. ఒకే తాడుకు ఉరివేసుకున్న నవవధువు, ప్రియుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2020 1:04 PM GMT
వికారాబాద్‌లో విషాదం.. ఒకే తాడుకు ఉరివేసుకున్న నవవధువు, ప్రియుడు

ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే.. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. ఆ యువతిని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించారు. ప్రేమించిన వాడికి మరిచిపోలేక.. కట్టుకున్న వాడితో కాపురం చేయలేక నరకం అనుభవించిన ఆ నవవధువు తీవ్ర నిర్ణయం తీసుకుంది. ప్రేమించిన వాడితో కలిసి ఒకే తాడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన మీనా(19), అదే గ్రామానికి చెందిన కార్తీక్‌(20) ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే.. వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. శంషాబాద్‌ మండలం మంచిరేవుకి చెందిన అబ్బాయితో మేనెలలో మీనాకు పెళ్లి చేశారు. తమ కుటుంబం పరువు కాపాడుకున్నామని ఆ కుటుంబ సభ్యులు బావించారు. అయితే.. కూతురు మనసును అర్థం చేసుకోలేకపోయారు. ప్రేమించిన వాడిని మరిచిపోలేక, కట్టుకున్న వాడితో కాపురం చేయలేక మీనా తీవ్ర నిర్ణయం తీసుకుంది. ప్రేమించిన వాడితో కలిసి జీవించలేకపోయిన.. కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కార్తీక్‌తో కలిసి నవాబుపేట మండలం పూలపల్లి గ్రామ పరిధిలో ఈ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఓ చెట్టుకు ఓకే తాడుతో ఉరివేసుకున్నారు.

పచ్చటి మైదానంలో.. ఒకేతాడుతో చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాల్ని చూసి స్థానికులు షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించీ.. మృతదేహాల్ని కిందకు దింపారు. అక్కడ‌ ఓ బైక్ పడి ఉంది. దాని నంబర్ బట్టీ పరిశీలించగా. వాళ్లు గతంలో ప్రేమించుకున్న ప్రేమికులు మీనా, కార్తీక్ లుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it