కాన్పూ కోసం 200 కిలోమీటర్లు.. తల్లీబిడ్డ మృతిపై హైకోర్టు సీరియస్‌

By సుభాష్  Published on  4 May 2020 1:18 PM GMT
కాన్పూ కోసం 200 కిలోమీటర్లు.. తల్లీబిడ్డ మృతిపై హైకోర్టు సీరియస్‌

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఓ మహిళ కాన్పు కోసం 200 కిలోమీటర్లు తిరిగి, తల్లి, బిడ్డ మృతి చెందడం సంచలనంగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా చిన్న తండ్రాపాడు గ్రామానికి చెందిన న్యాయవాది కరణం కిశోర్‌ కుమార్‌ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. ఈ మేరకు సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈకేసు విచారణ చేపట్టింది. అతి చిన్న కారణాలతో ఆరు ఆస్పత్రులు తిప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన లేఖలో ప్రస్తావించారు. లాక్‌డౌను తప్పుగా అర్థం చేసుకుని, వైద్య సిబ్బంది, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తల్లీ, బిడ్డ ప్రాణాలు పోయాయని పేర్కొన్నారు. అత్యవసర చికిత్సలకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాది రాసిన లేఖలోని అంశాలను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది హైకోర్టు.

అసలు ఏం జరిగింది..

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం యాపదిన్నె ప్రాంతానికి జెనీలా అనే మహిళకు నెలలు నిండటంతో కాన్పు కోసం జిల్లా ఆస్పత్రికి ఈ నెల 24వ తేదీన వెళ్లింది. రక్తం తక్కువగా ఉందని, అలాగే బీపీ కూడా తక్కువగా ఉందని కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్య సిబ్బందికి సూచించారు. అయితే కరోనా వైరస్‌ కారణంగా కర్నూలు వెళ్లే పరిస్థితులు లేనందున కలెక్టర్‌కు సమాచారం అందించగా, మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి వెళ్లేందుకు 102 వాహనాన్ని సిద్ధం చేయించి పంపిచారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. జెనీలా పరిస్థితి విషమంగా ఉందని చెబుతూ హైదరాబాద్‌ కోఠి ఆస్పత్రికి తరలించారు.

అయితే కారోనా వైరస్‌ కారణంతో గద్వాలను హాట్‌ స్పాట్‌గా గుర్తించినందున ఆమెను కరోనా పరీక్షల కోసం కోఠి ఆస్పత్రి వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. ఇక ప్రసవం కోసం మళ్లీ పేట్లబురుజు ఆస్పత్రికి తరలించారు. చివరకు శనివారం కాన్పు నిర్వహించగా, మగబిడ్డ పుట్టడు.

బాబుకు ఊపిరి తీసుకోవడం సమస్య ఉందని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బిడ్డ అదే రోజు మృతి చెందాడు. ఇక జెనీలా పరిస్థితి కూడా విషమించడంతో పేట్లబురుజు ఆస్పత్రి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. సకాలంలో వైద్యం అందించకపోవడం వల్ల తల్లీబిడ్డలు మృతి చెందారని కుటుంబీకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో న్యాయవాది రాసిన లేఖపై హైకోర్టు విచారణ చేపట్టింది.

Next Story