కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. ఇక కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దొరక్కపోవడంతో మందుబాబులకు నానా అవస్థలు పడుతున్నారు. మందు కష్టాలు భారత్‌లోనే కాదు.. విదేశాల్లో కూడా. తాజాగా కల్తీ మద్యం సేవించి 12 మంది మృత్యువాత పడ్డారు.

వివరాల్లోకి వెళితే..ఈ దారుణ ఘటన నేపాల్‌ దేశం ఖాట్మండులో చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 12 మంది మృతి చెందారు. మృతులంతా మహోత్తరి జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వీరంతా కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

కాగా, మృతి చెందిన వారందరిలోనూ ఒకే రకమైన అనారోగ్య లక్షణాలు కనిపించాయని అధికారులు వెల్లడించారు. అందరు కూడా కడుపు నొప్పి, డయేరియా, వాంతులతో బాధపడినట్లుగా తెలిపారు. వారంతా కల్తీ మద్యం తాగినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.