తెలంగాణ‌లో మే 21 వ‌ర‌కు లాక్‌డౌన్‌..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 May 2020 12:53 PM GMT
తెలంగాణ‌లో మే 21 వ‌ర‌కు లాక్‌డౌన్‌..?

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌డంతో కేంద్ర‌ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌ను మే 17 వ‌ర‌కు పొడిగించింది. ఈ క్ర‌మంలోనే రెడ్‌, కంటోన్మెంట్ జోన్లు మిన‌హాయించి.. గ్రీన్‌, ఆరెంజ్ జోన్ల‌లో ప‌లు సండ‌లింపులు ఇచ్చింది. ఇప్పుడు అంద‌రి దృష్టి తెలంగాణ పై ప‌డింది. తెలంగాణలో మే7 న లాక్‌డౌన్ ముగియ‌నుండ‌డంతో సీఎం కేసీఆర్ ఏ నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక తెలంగాణ‌లో మ‌రో రెండు వారాల పాటు లాక్‌డౌన్ ను పొడిగించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణ‌యంతో ఈ నెల 21 వ‌ర‌కు దానిని పొడిగించాల‌ని ప్ర‌భుత్వం బావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ పొడిగింపు తదితర అంశాలపై ఆదివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్ సుదీర్ఘ స‌మీక్ష నిర్వ‌హించారు.

గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ రెండు జోన్ల‌లో ఎంత వ‌ర‌కు ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించ‌వ‌చ్చు అనే దానిపై చ‌ర్చించారు. దేశవ్యాప్త లాక్ డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించిన నేపధ్యంలో రాష్ట్రంలో కూడా మరో రెండు వారాల పాటు కొనసాగించాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. కంటైన్మెంట్‌ జోన్లలో క్వారంటైన్‌ గడువు ఈ నెల 21తో ముగియనుండటంతో.. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వ‌ల‌స‌కార్మికుల‌ను స్వ‌స్థ‌లాల‌కు పంపించే విష‌యంలో కేంద్రం తాజాగా యూ ట‌ర్న్ తీసుకోవ‌డం పై చ‌ర్చ జ‌రిగింది. అనుకోని పరిస్థితుల్లో రాష్ట్రానికి వచ్చి చిక్కుకుపోయిన వారిని మాత్రమే తిరిగి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాల వల్ల తలెత్తే పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

కాగా, రేపు జరగబోయే కేబినేట్ సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. లాక్‌డౌన్‌ పొడిగింపు, సడలింపులు, పాటించాల్సిన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించినట్లు సమాచారం. మరీ సీఎం సార్ ఏ నిర్ణ‌యం తీసుకుంటారో రేపు తెలుస్తుంది.

Next Story