కరోనా హెల్త్‌ బులిటెన్‌లో అరకొర సమాచారం.. తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం

By సుభాష్  Published on  1 July 2020 3:44 PM IST
కరోనా హెల్త్‌ బులిటెన్‌లో అరకొర సమాచారం.. తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం

జీవించే హక్కును కాలరాసే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తెలంగాణ కరోనా హెల్త్‌ బులిటెన్‌లలో అరకొర సమాచారంపై మరోసారి ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ధర్మాసం అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కంటైన్‌మెంట్‌ విధానమేంటో తెలుపాలని ఆదేశాలు జారీ చేసింది. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. అలాగే తెలంగాణలో 20 రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలు తెలుపాలని ఆదేశించింది. అయితే కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యమన్న హైకోర్టు.. ఐసీఎంఆర్‌ నిబంధనలకు విరుద్దంగా పీహెచ్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారని హైకోర్టు తెలిపింది.

ఆర్‌ఏడీ బ్లడ్‌ శాంపిల్స్‌ ఎందుకు చేయకూడదని, పది నిమిషాల్లో రిజిల్ట్‌ వచ్చే పరీక్షలు చేయాలని ఆదేశించామని, ఎన్ని యూనిట్స్‌ తెచ్చారు.. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. 50వేల పరీక్షలు చేస్తామని చెప్పి మూడు రోజులు అసలే పరీక్షలు నిర్వహించలేదని పిటిషనర్‌ తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌, శ్రీరంగ పూజితలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మే 23 నుంచి జూన్‌ 23వ తేదీ వరకు ఎన్ని టెస్టులు చేశారు.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ శాంపిల్స్‌ ఎన్ని తీసుకున్నారు.. జూన్‌ 26న ఐసీఎమ్మార్‌ గైడ్‌లైన్‌ ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, లేనివారికి ఎన్ని పరీక్షలు చేశారో తెలుపాలని హైకోర్టు ఆదేశించింది.

అలాగే ఏప్రిల్‌ 21, జూన్‌ 8, జూన్‌ 18న ఎన్నెన్ని కిట్లను ఇచ్చారో, దీన్ని కూడా కోర్టు దిక్కరణ కింద తీసుకుంటామని తెలిపింది. 17న తేదీ వరకు ఆదేశించిన పనులు పూర్తికాకపోతే 20న చీఫ్‌ సెక్రెటరీ, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, హెల్త్‌, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌, హెల్త్‌ కమిషనర్‌ హాజరు కావాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలు సమర్పించకపోతే కోర్టు దిక్కరణగా భావించాల్సి వస్తుందని పేర్కొంది.

Next Story