బీహార్ రాష్ట్రం మీద వరుణుడు పగబట్టినట్లు ఉన్నాడు. ఉరుములు, పిడుగుల దెబ్బకు ఒక్క రోజులోనే ఏకంగా 23 మంది మరణించారు. శనివారం నాడు వచ్చిన ఉరుములు, పిడుగుల ధాటికి అయిదు జిల్లాల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. భోజ్ పూర్ జిల్లాలో ఏకంగా తొమ్మిది మంది మరణించారని డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ తెలిపింది.

శరన్ జిల్లాకు చెందిన అయిదుగురు మరణించగా.. కైమూర్ జిల్లాలో మూడు మరణాలు మరణాలు సంభవించాయి. పాట్నా జిల్లా లో ఇద్దరు, బక్సార్ జిల్లాలో ఒకరు మరణించారు. ఒక్క రోజు కిందటే ఎనిమిది మంది బీహార్ రాష్ట్రంలో మరణించినట్లు వార్తలు రాగా.. 24 గంటల్లో మరో 23 మంది మృత్యువాత పడ్డారు.

ఈ మరణాలపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ఇళ్ల నుండి బయటకు రాకూడదని కోరారు. వారం రోజుల వ్యవధిలో బీహార్ రాష్ట్రంలో 100 మందికి పైగా మరణించారు.

తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఉండే సాధారణ వాతావరణానికి, బంగాళాఖాతం నుండి వచ్చే తేమతో కూడిన గాలులు రాష్ట్రాల్లోకి రావడం వలన వాతావరణంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయని నిపుణులు చెబుతూ ఉన్నారు. వీటి వలనే యూపీ, బీహార్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపుల దెబ్బకు 150 మందికి పైగా మరణించారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐఎండి డైరెక్టర్ జెనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర మాట్లాడుతూ వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల విషయంలో ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అలర్ట్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రాల్లోని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తున్నామని అన్నారు. వీలైనంత వరకూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. సమాచారం అందరికీ చేరేలా చర్యలు చేపట్టామని అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story