హైదరాబాద్: గోడ కూలి 9 మంది మృతి
By సుభాష్ Published on 14 Oct 2020 4:08 AM GMTహైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వాయుగుండం కారణంగా నగరంలో భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. నగరమంతా జలదిగ్బంధంలో మునిగిపోయింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో చంద్రాయగుట్ట మహ్మదీయ హిల్స్‌లో మంగళవారం అర్ధరాత్రి కాంపౌండ్ వాల్ కూలి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మహ్మదీయహిల్స్‌లో ఓ కాంపౌడ్ వాల్ కూలి ఐదు ఇళ్లపై పడింది. దీంతో ఒక ఇంట్లో ఉన్న ఐదుగురు, మరో ఇంట్లో ఉన్న ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న రెస్క్యూటీమ్ సహాయక చర్యలు చేపట్టింది.
రాత్రి 12.30 గంటల సమయంలో ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో ఫలక్‌నుమా ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఎంపీ అసదుద్దీన్ ఓవైపీ ఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం ఆయన పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే మరో రెండు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇళ్ల నుంచి బయటకు ఎవ్వరు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
భారీ వర్షం కారణంగా హైదరాబాద్ రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. రోడ్లపైకి భారీ వరదనీరు చేరడంతో విద్యుత్ స్తంభాలు సైతం నేలకొరిగాయి. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో రాత్రంతా విద్యుత్‌కు అంతరాయం కలిగింది. కాగా, బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం మంగళవారం సాయంత్రం తూర్పు ఈశాన్య దిశగా ప్రయాణించి ఖమ్మం జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అక్కడి నుంచి మధ్య మహారాష్ట్ర యరత్వాడ వైపు వెళ్తోందని అధికారులు వెల్లడించారు. బుధవారం సాయంత్రానికి వాయుగుండం కాస్త బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపారు. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం పడింది. కేవలం ఆరు నుంచి ఏడు గంటల వ్యవధిలోనే దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది.