కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య..!

By సుభాష్  Published on  14 Oct 2020 3:47 AM GMT
కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య..!

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల ఏసీబీ ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టాడు. రూ. కోటి 10 లక్షల లంచం కేసులో ఆయన నిందితుడు. నెల రోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో నాగరాజు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కాగా, నకిలీ పాసు పుస్తకాల జారీ విషయంలో నాగరాజు పై ఏసీబీ అధికారులు మంగళవారం ప్రశ్నల వర్షం కురిపించింది. రెండోసారి అతడిని కస్టడిలోకి తీసుకున్నారు. అయితే కందాడి ధర్మారెడ్డి, అతని కుటుంబ సభ్యులకు, ఇతరులకు కలిపి దాదాపు 24 ఎకరాల భూమి అక్రమ పద్దతిలో పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అసలు హక్కుదారులు, వారసులు ఉండగా నకిలీ పత్రాలు ఎలా సృష్టించారని, ఇందుకు ఎవరు సహకరించారు, దీని వెనుక ఎంత డబ్బులు చేతులు మారిందనే విషయంపై ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ధర్మారెడ్డి స్థానికంగా ఉన్న 140 ఎకరాలు స్వాహా చేద్దామని చేసిన ప్లాన్‌కు ఎవరు సహకరించారని కూడా ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.

అయితే ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉన్న నాగరాజు ప్రజాసేవ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అవినీతి ఆరోపణలతో ఉన్న మంచి పేరును చేరిపేసుకున్నారు. నకిలీ పాసు పుస్తకాల జారీ విషయంలో నాగరాజు అడ్డంగా దొరికపోయారు. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఏసీబీ అడిగిన ప్రశ్నలకు నాగరాజు ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేయడం, నీళ్లు నమలడం లాంటివి చేశారు. నాగరాజు మెడకు ఉచ్చు బిగుస్తుండటంతో ఇక తాను ఈ కేసు నుంచి బయటపడటం సాధ్యం కాదని భావించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

Next Story