లాక్‌డౌన్‌: కాస్త మెరుగైన 'గంగమ్మ' ఆరోగ్యం

By అంజి  Published on  3 April 2020 3:04 AM GMT
లాక్‌డౌన్‌: కాస్త మెరుగైన గంగమ్మ ఆరోగ్యం

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కఠినంగా అమలు అవుతోంది. ప్రజలు ఎవరూ బయట తిరగడం లేదు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ వల్ల దేశ వ్యాప్తంగా మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ విధించారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా పలు కంపెనీలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలను మూసివేశారు. దీంతో పరిశ్రమల వ్యర్థాలు నదుల్లోకి చేరడం చాలా వరకు తగ్గింది.

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వల్ల గంగా నదిలో స్వచ్ఛత పెరుగుతోందని తెలుస్తోంది. ప్రజల నిత్యావసరాలు తప్ప ఇతర పరిశ్రమలు నడవడం లేదు. దీంతో వ్యర్థ పదార్థాలు నదుల్లోకి చేరడం తగ్గిందని నిపుణులు, పర్యావరణ వేత్తలు అంటున్నారు.

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సమాచారం ప్రకారం గంగా నదిలో నీరు స్వచ్ఛంగా మారింది. జలచరాలు సంచరించేందుకు, జీవిందచేందుకు అనువుగా మారింది. గంగా నదికి 36 పర్యవేక్షణ ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో 27 ప్రాంతాల్లో నీరు స్వచ్ఛంగా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ బొర్డు తెలిపింది. జీవ రసాయన ప్రాణ వాయువు, నీటిలో కరిగిన ప్రాణవాయువు, మొత్తం కోలిఫామ్‌ స్థాయిలు, పీహెచ్‌ పరామితులను అనుసరించి నదుల స్వచ్ఛతను కొలుస్తారు. గతంలో గంగానదిలోని చాలా ప్రాంతాల్లో నీరు అనుకూలంగా లేదు.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో పరిశ్రమల ఉద్గారాలు తగ్గాయి. అవి నీటిలో కలవడం తగ్గడంతో.. నది ఆరోగ్యం కాస్త మెరుగువుతోందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. అయితే ఇది కొంత కాలమేనన్న భావన వారిని ఆవేదనకు గురి చేస్తోంది.

పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం ఎంత మొత్తంలో నదిలో కలుస్తుందో లెక్కించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు ఇదే మంచి సమయమని, ప్రమాణాలను నిర్దేశించేందుకు సరైన సమయమని పర్యావరణ వేత్తలు అంటున్నారు. గంగా నది ఉపనదులైన హిందో, యమునా నదుల్లో కూడా స్వచ్ఛత పెరిగింది.

Next Story