జమ్మూకశ్మీర్‌లో భోణి కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
By Medi Samrat Published on 8 Oct 2024 1:18 PM GMTహర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్‌కు పునరాగమనంపై ఆశలు కల్పించాయి, అయితే ఫలితాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండగా.. కాంగ్రెస్ పునరాగమనం ఆశలకు గండిపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హర్యానా ఎన్నికల్లో ఎన్నో పెద్ద వాగ్దానాలు చేసినా అవన్నీ ఫలించలేదు. హర్యానాలో పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అయితే పార్టీ ఓట్ల శాతం ఖచ్చితంగా పెరిగింది. 2024 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 1.79 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులందరూ ఓడిపోయారు. అయితే.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరటనిచ్చాయి. తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర అసెంబ్లీలో కూర్చోనున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. హర్యానాతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటరు శాతం తక్కువగా ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీకి 0.52 శాతం ఓట్లు వచ్చాయి. హర్యానాలో మొత్తం 1.79 శాతం ఓట్లు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్‌లోని దోడా స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ ఆప్ అభ్యర్థి మెహరాజ్ మాలిక్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన విజయం సాధించారు. మెహ్రాజ్ మాలిక్‌కు 23,228 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల్లో 4,538 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.