హర్యానాలో కేజ్రీవాల్‌ 'ఆప్‌'కు ఘోర ప‌రాభ‌వం

హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది

By Medi Samrat  Published on  8 Oct 2024 10:07 AM GMT
హర్యానాలో కేజ్రీవాల్‌ ఆప్‌కు ఘోర ప‌రాభ‌వం

హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటి వరకు 4 స్థానాల్లో విజయం సాధించి 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించి 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హర్యానా ప్రజలు ఆప్‌ను ఖాతా తెరిచేందుకు కూడా అనుమతించలేదు.

హర్యానా ప్రజలు ఈసారి ఆప్ వాగ్దానాలను విశ్వసించలేదని ఫలితాలు చూపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. చాలా స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు 600, 800 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంబాలాలో ఆప్‌కి చెందిన రాజ్ కౌర్ గిల్‌కు 421 ఓట్లు వచ్చాయి. ఎల్లెనాబాద్‌లో మనీష్ అరోరాకు 879 ఓట్లు వచ్చాయి. లాడ్వాలో జోగా సింగ్ ఉమ్రీకి 627 ఓట్లు వచ్చాయి. గుర్గావ్‌లో నిశాంత్‌ ఆనంద్‌కు 1,659 ఓట్లు వచ్చాయి. బద్ఖల్‌లో ఎం ప్రకాష్ వర్మకు 1681 ఓట్లు వచ్చాయి. ఈ 5 సీట్లపై ఆశ‌లు పెట్టుకున్న ఆప్‌కు అక్క‌డ కూడా పరిస్థితులు క‌లిసిరాలేదు.

ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న తాజా ట్రెండ్స్ ప్రకారం.. స్వతంత్రులు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి), బిఎస్‌పి ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఆప్ లాగే జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూడా ఏ స్థానంలోనూ ఆధిక్యంలో లేదు.

Next Story