కేంద్రమంత్రి పదవికి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Sep 2020 1:59 AM GMT
కేంద్రమంత్రి పదవికి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లులు ఎన్డీయే కూటమిలో చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఈ బిల్లులను నిరసిస్తూ కేంద్రమంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్‌ సభ్యురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను ప్రధాని మోదీ కార్యాలయంలో ఆమె సమర్పించారు. శిరోమణి అకాలీదళ్‌ ఎన్డీయేలో ప్రధాన భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే, రైతులు, వ్యవసాయ సంబంధ ఉత్పత్తులకు సంబంధించిన కీలక బిల్లులను కేంద్రం తీసుకురాగా.. వీటిలో అనేక అంశాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, వ్యవసాయ రంగం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని అకాలీదళ్‌ అభిప్రాయపడింది. ఈ బిల్లు చట్టరూపందాలిస్తే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్తుందని పేర్కొంటూ కేంద్రంతో అకాలీదళ్‌ విబేధించింది.

ఈ రకమైన అభిప్రాయాన్ని ఇప్పటివరకు ఎక్కడా వ్యక్తంచేయని అకాలీదళ్‌.. లోక్‌సభలో చర్చ సందర్భంగా లేవనెత్తడం ప్రభుత్వాన్ని కొంత ఇబ్బందికి గురిచేసినట్టయింది. ఈ బిల్లులపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ మాట్లాడుతూ.. ఈ బిల్లు వ్యవసాయ రంగానికి వ్యతిరేంకగా ఉందని, తాము పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇకపై తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కొనసాగలేదని స్పష్టంచేశారు.

ఇప్పుడు తమ పార్టీ తరఫున కేంద్రమంత్రిగా ప్రాతినిద్యం వహిస్తున్న హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నారని ఆయన ప్రకటించారు. అనంతరం కొద్దిసేపటికే సభ నుంచి బయటకు వచ్చిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ పీఎంవోకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగానే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు.

అయితే, శిరోమణి అకాలీదళ్‌ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పటికీ ఎన్డీయేలో కొనసాగనున్నట్టు సమాచారం. మరోవైపు, ఈ బిల్లులు లోక్‌సభ ఆమోదం తర్వాత రాజ్యసభకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, రాజ్యసభలో ఏయే బిల్లులను చర్చించాలి.. వేటిని సెలెక్ట్‌ కమిటీకి పంపాలనే అంశంపై ఇటీవల కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విపక్షాలతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

ఆ మూడు బిల్లులు ఇవే..

1. రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనను తొలగిస్తూ తీసుకొచ్చిన... ‘ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) బిల్లు’.

2. పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంపై వ్యాపారులతో రైతులు చేసుకొనే ఒప్పందాలకు రక్షణ కల్పించే... ‘ద ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌ బిల్లు’.

3. సహకార బ్యాంకులపై పర్యవేక్షణ అధికారాలను ఆర్‌బీఐకి కట్టబెడుతూ తీసుకొచ్చిన ‘ద బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ (అమెండ్‌మెంట్‌)' బిల్లు.

Next Story
Share it