వచ్చే ఏడాది ప్రారంభంలో కరోనా వ్యాక్సిన్‌: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

By సుభాష్  Published on  17 Sep 2020 12:17 PM GMT
వచ్చే ఏడాది ప్రారంభంలో కరోనా వ్యాక్సిన్‌: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

దేశంలో కరోనా మరణాల రేటును 1శాతం కంటే తక్కువ తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.64 శాతంగా ఉందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ మరణాల రేటు ఉందని అన్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా మంత్రి ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 78-79 శాతంగా ఉందని అన్నారు. అలాగే ప్రపంచంలోనే అతి ఎక్కువ రికవరీ రేటు కలిగిన దేశం మనదేనని, దేశంలో పాజిటివ్‌ కేసులు 50 లక్షలు దాటినప్పటికీ యాక్టివ్‌ కేసుల సంఖ్య 20 శాతం కంటే తక్కువేనని మంత్రి పేర్కొన్నారు. దేశంలో అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.

వచ్చే ఏడాది మొదట్లో దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితులను స్వయంగా ప్రధాని మోడీ పర్యవేక్షిస్తున్నారని, ఆయన నేతృత్వంలో నిపుణుల బృందం మంచి ప్రణాళికతో పని చేస్తుందన్నారు. జనవరి 30న దేశంలో మొదటి కేసు నమోదు కాకముందే దానికి సంబంధించిన సూచనలు చేశామన్నారు. మొదటి పాజిటివ్‌ కేసున నమోదైనప్పుడు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ద్వారా 162 మందిని గుర్తించామని, కేసుల సంఖ్యను తగ్గించడానికి లాక్‌డౌన్‌ ఎంతో దోహదం చేసిందన్నారు. కరోనా విషయంలో ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో చాలా తక్కువ అని అన్నారు.

Next Story