ఐపీఎల్‌లో రాణించినా.. జ‌ట్టులోకి తీసుకోరా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 May 2020 12:05 PM GMT
ఐపీఎల్‌లో రాణించినా.. జ‌ట్టులోకి తీసుకోరా..?

భార‌త క్రికెట్ జ‌ట్టు సెలెక్టర్లపై స్పిన్నర్‌, సీనియ‌ర్ ఆట‌గాడు హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యాడు. ఐపీఎల్‌లో రాణించినా.. సెల‌క్ట‌ర్లు తనను ఓ ఆటగాడిగానే పరిగణించడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. ప్ర‌పంచంలో ఉత్త‌మ ఆట‌గాళ్లు ఆడే ఐపీఎల్‌లో రాణిస్తున్న‌ప్పుడు.. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో ఎందుకు రాణించ‌లేన‌ని సెల‌క్ట‌ర్ల‌ను ప్ర‌శ్నించాడు. సెల‌క్ట‌ర్లు నాకు వ‌య‌సు అయిపోయింద‌నుకుంటున్నార‌ని.. ఒక‌వేళ ఈ ఐపీఎల్‌లో రాణిస్తే మాత్రం.. భార‌త్ త‌రుపున టీ20 ఆడేందుకు సిద్ద‌మ‌వుతాన‌ని అన్నాడు.

2016లో చివ‌రిసారిగా ఆసియాక‌ప్ టీ20 ఆడిన భజ్జీ.. ఇప్ప‌టివ‌ర‌కూ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. అయితే.. ‌ 2018 నుండి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టుకు ఆడుతున్నాడు. ఇటీవ‌ల‌ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన‌ భజ్జీ.. ఈ వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్‌లో 157 ఇన్నింగ్స్‌ల్లో 150 వికెట్లు ప‌డ‌గొట్టిన భజ్జీ.. లీగ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు ఔట్ చేసిన నేను.. అంతర్జాతీయ క్రికెట్‌లో వారిని ఔట్ చేయలేనా?.. అని హర్భజన్ సెలెక్టర్లను ప్ర‌శ్నించాడు.

వయసు అయిపోయిందనే ఒకే కారణంతో.. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించినా.. సెలెక్టర్లు తనను పరిగణలోకి తీసుకోవడం లేదన్నాడు. గడిచిన‌ నాలుగేళ్లుగా దేశ‌వాళీ క్రికెట్ ఆడకున్నా ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాన‌ని. అయినా సెలెక్టర్లు నన్ను పట్టించుకో లేదని ఈ ఆఫ్ స్పీన్నర్ అసహనం వ్యక్తం చేశాడు. అలాగే.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్న జట్ల కన్నా ఐపీఎల్ టీమ్స్ చాలా బలమైనవని హ‌ర్భ‌జ‌న్ అన్నాడు. అన్ని అన్ని జట్లలో నాణ్యమైన ఆటగాళ్లు లేరని.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మాత్రమే మంచి బ‌ల‌మైన‌ బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్నాయన్నాడు.

Next Story