మరో ప్రయోగానికి హైదరాబాద్ మెట్రో సిద్ధం..
By అంజి Published on 28 Feb 2020 11:55 AM IST![మరో ప్రయోగానికి హైదరాబాద్ మెట్రో సిద్ధం.. మరో ప్రయోగానికి హైదరాబాద్ మెట్రో సిద్ధం..](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/02/7e6a7db0-cc78-4063-9c55-f3c23d1036dd.jpg)
హైదరాబాద్ మెట్రో ఇప్పటికే అనేక రికార్డులను కొల్లగొట్టింది. మెట్రో ప్రయాణికుల కోసం అధికారులు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉదయం.. సాయంత్రం వేళల్లో షార్ట్ లూప్స్ రైళ్లను నడుపుతోంది. ఈ క్రమంలోనే మరికొన్ని కొత్త పద్దతులను అవలంబించేందుకు సిద్ధమైంది. అవసరం మేరకు ఇంటర్ కారిడార్ రైళ్లను నడపాలనుకుంటోంది హైదరాబాద్ మెట్రో సంస్థ. దీని ద్వారా హబ్సిగూడ నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. ప్రస్తుతం మెట్టుగూడలో ఎక్కిన ప్రయాణికులు.. ఎంజీబీఎస్ చేరుకోవాలంటే రెండు రైళ్లు తప్పనిసరిగా మారాలి. మొదట పరేడ్ గ్రౌండ్ స్టేషన్‌లో దిగి.. జేబీఎస్-పరేడ్ గ్రౌండ్ స్టేషన్‌లో మెట్రో ఎక్కాలి. లేదంటే తూర్పు సికింద్రాబాద్ మెట్రో స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ పశ్చిమ సికింద్రాబాద్ వెళ్లి మెట్రో ఎక్కాలి. ఇవి రెండు వేర్వేరు కారిడార్లు. అయితే నేరుగా ఎంజీబీఎస్ వెళ్తే సౌకర్యవంతంగా ఉంటుందన్నది ప్రయాణికుల కోరిక.
కారిడార్లను కలుపుతున్న సర్వీస్ ట్రాక్‌లు..
నాగోల్- రాయదుర్గం కారిడార్-3కి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వెళ్లే కారిడార్-2ని చిలకలగూడ వద్ద సర్వీస్ ట్రాక్ కలుపుతోంది. ఇది సర్వీసు రీత్యా అత్యవసరం సమయంలో వినియోగించుకునేందుకు మెట్రో అధికారులు నిర్మించారు. దీనిలోకి ప్రయాణికులకు అనుమతి లేదని అధికారులు గతంలోనే తెలిపారు. అయితే కారిడార్-2 ప్రత్యేకంగా డిపో లేదు. దీంతో ఉప్పల్ డిపో నుంచి వచ్చే మెట్రో రైళ్లు ఈ సర్వీస్ ట్రాక్ మీదుగానే ఎంజీబీఎస్ స్టేషన్ చేరుకుంటున్నాయి. అయితే ప్రయాణికుల డిమాండ్ మేరకు త్వరలోనే ఎంజీబీఎస్ నాగోల్ నుంచి నేరుగా ఎంజీబీఎస్ వరకు రైళ్లు నడుపుతామని ఎండీ ఎన్వీఎస్ పేర్కొన్నారు. ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
అమీర్‌పేటలో సైతం సర్వీసు ట్రాక్ నిర్మించారు. ఇది నాగోల్-రాయదుర్గం కారిడార్3ని, మియాపూర్-ఎల్‌బీనగర్ కారిడార్ 2ని కలుపుతుంది. దీని ద్వారా నాగోల్ నుంచి నేరుగా మియాపూర్ వరకు మెట్రో రైళ్లనలు నడుపువచ్చు. కానీ ఈ ఇంటర్ కారిడార్‌లో రైళ్లను నడపుతారా అన్నది తెలియాల్సి ఉంది.
కొన్ని రైళ్లను మధ్య స్టేషన్ల నుంచే నడుపుతున్నారు. మెట్టుగూడ-రాయదుర్గం వరకు రద్దీ వేళల్లో ఒక రైలును నడుపుతున్నారు. మరో మియాపూర్ నుంచి వచ్చే రైలు లక్డీకాపూల్‌లో ఖాళీ అవుతుండడంతో తిరిగి వెనక్కి పంపుతున్నారు. అమీర్‌పేట-రాయదుర్గం మధ్య మరో అదనపు రైలును నడుపుతున్నారు.