వైసీపీ గూటికి గుంటూరు టీడీపీ నేత..!
By రాణి Published on 22 Jan 2020 10:55 AM ISTటీడీపీ నుంచి శాసన మండలి సభ్యుడిగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి మంగళవారం ఉదయం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా పార్టీకి మాత్రం ఆయన ఇంత వరకు రాజీనామా చేయలేదు. శాసన మండలి సభ్యుడిగా మాత్రమే రాజీనమా చేశానని స్వయాన ఆయనే చెబుతున్నారు.
కాగా, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి శాసన సభలో బిల్లు ఆమోదం పొందడంతో దానికి మనస్థాపం చెంది రాజీనామా చేసినట్టుగా కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే, తెర వెనుక వేరే రకమైన కార్యక్రమాలు జరుగుతున్నట్టు కూడా సమాచారం.
వైసీపీ నేతలు గత కొన్ని రోజులుగా డొక్కా మాణిక్య వరప్రసాద్ తో చర్చిస్తున్నట్టు కూడా సమాచారం వస్తుంది. అయితే, 2019 తరువాత కూడా ఆయన పలు సందర్భాల్లో జగన్ ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తూ వస్తున్నారు. టీడీపీ దూకుడుగా వెళ్తున్నప్పటికి ఆయన మాత్రం ప్రభుత్వంపై సానుకూలమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వానికి అనుకూలమైన మాటలు కూడా మాట్లాడిన సందర్భాలను చాలానే ఉన్నాయి.
అయితే, ఇప్పుడు మాత్రం గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత అంబటి రాంబాబుతో డొక్కా మాణిక్య వర ప్రసాద్ నిరంతరం టచ్‌లోకి వెళ్తున్నారని టీడీపీ అధిష్టానానికి సమాచారం వచ్చింది. డొక్కా మాత్రం స్నేహం వేరు..రాజకీయాలు వేరంటూ కొట్టిపారేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన వైసీపీవైపు చూస్తున్నారని, ఆ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు తన రాజకీయ గురువు అయిన రాయపాటి సాంబశివరావు కూడా పాలిటిక్స్ నుంచి రిటైర్డ్ అయ్యే సమయం వచ్చింది. కనుక ఇప్పుడు ఆయన సలహాలు తీసుకునే వీలు కూడా లేదు. దీంతో డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో చేరుతారని గుంటూరు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధిష్టానం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.