శాసనమండలిలో బిల్లులపై సమరం..

By అంజి  Published on  22 Jan 2020 5:36 AM GMT
శాసనమండలిలో బిల్లులపై సమరం..

అమరావతి: శాసనమండలిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ప్రభుత్వ తీరును తప్పు పడుతూ టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి ప్రసంగించారు. రాజధాని రైతులు చనిపోతే కనీసం పరామర్శించని సీఎం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల కోసం సీఎం డమ్మీ కాన్వాయిని తిప్పారని సంధ్యారాణి అన్నారు. సంధ్యారాణి కామెంట్లపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని టీడీపీ రాజకీయం చేస్తున్నారంటూ అధికార నాయకులు మండిపడ్డారు. సభలో సంధ్యారాణికి టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు అండగా నిలిచారు.

అదే సమయంలో మంత్రులు కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌లు ప్రతి పక్ష సభ్యుల వైపు దూసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభ్యులను ఉమ్మారెడ్డి శాంతింపజేశారు. గత ప్రభుత్వ విధానాలను.. ప్రస్తుత ప్రభుత్వ విధానాలను బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ తప్పు బట్టారు. మూడు రాజధానుల విధానం సరికాదన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ విధానం మంచిదని.. తప్పులు సరిదిద్దాలని మాధవ్‌ సూచించారు. ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వ విధానాలే కారణమంటూ మాధవ్‌ విమర్శలు చేశారు.

రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చ జరుగుతోంది. బిల్లులకు టీడీపీ మూడు సవరణలు ప్రతిపాదించింది. రూల్‌ 143 కింద వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు ఇచ్చింది. బిల్లులకు సవరణలు సూచిస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు మరో రెండు నోటీసులిచ్చారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టే అర్హత ప్రభుత్వానికి లేదని టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించారు.

Next Story