నా విజయాలు నావే.. కల్పన ఏముంటుంది?

By మధుసూదనరావు రామదుర్గం  Published on  20 Aug 2020 8:14 AM GMT
నా విజయాలు నావే.. కల్పన ఏముంటుంది?

గుంజన్‌ సక్సేనా.. మొన్నటి దాకా పరిమిత పరిధుల్లోనే వినిపించిన పేరు కార్గిల్‌ గర్ల్‌ విడుదలానంతరం భారతీయ ప్రజల నోట్లో నానుతోంది. సినిమా బాగుందీ బావోలేదు అనడం పక్కన పెడితే గుంజన్‌ పై పలు విమర్ళల దుమారం చెలరేగింది. ఈ వివాదాల సుడిలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయిన గుంజన్‌ ఓ సదీర్ఘ వివరణ ఇవ్వడం అత్యవసరమని భావించింది. అందరికీ సమాధానం కాకపోయినా కనీసం తనను ప్రేమించే.. అభిమానించే కొందరికైనా ఈ వివరణ సంతృప్తినిస్తుందని తను భావించారు. ఏన్డీటీవీలో ఈ వివరణ ప్రచురితమైంది.

‘మొట్టమొదట ప్రజలకు తెలియవల్సిన విషయం ఏంటంటే నా జీవితాధారిత చిత్రం సినిమాటిక్‌ కాబట్టి సృజన స్వేచ్ఛ తీసుకున్నా.. వాస్తవాన్ని నిర్మాత, దర్శకులు మార్చలేదు. కారణం ఆ వాస్తవం నేనే. సినిమాలో చూపించిన దానికంటే నేను ఇంకా దృఢచిత్తం ఉన్నదాన్ని. నాది ఉక్కుసంకల్పం. నా ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే నా కొలీగ్స్‌ చిన్న, పెద్ద.. సీనియర్లు, జూనియర్లు అందరూ నాకు అత్యద్భుత గౌరవం ఇచ్చారు. వారి సహకారం ఎన్నడూ మరవలేనిది.

భారత వాయుసేనలో నా తొలి సర్వీసులోనే చాలా అంశాల్లో ప్రథమురాలిగా నిలిచాను. హెలికాఫ్టర్‌ శిక్షణలో నేనే ప్రథమురాలిని, యుద్ధరంగంలో హెలికాఫ్టర్‌నడిపిన తొలి మహిళను నేనే, మహిళా హెలికాఫ్టర్‌ పైలట్లలో మొదటి బిజి నాదే. అడవుల్లో, మంచు ప్రదేశాల్లో ఎలా బతకాలో నేర్పే కొర్సు చేసిన మొదటి మహిళను నేనే. ఇంత ఉత్కృష్టమైన కెరీర్‌ పై కొందరు అసందర్భంగా విమర్శిస్తూ బురద జల్లడం సరికాదు. ఎవరెన్ని మాటలు చెప్పినా నా రికార్డులు ఐఏఎస్‌ చరిత్రలో సురక్షితంగా రికార్డయి ఉన్నవి.

చెయ్యెత్తలేదంటే చేతకాని వారనికాదు.. సంయమనం ఉన్నవారని అర్థం అన్న నానుడి నా వరకు సరిగ్గా సరిపోతుంది. నేను మొదటి నుంచి చాలా కామ్‌గా ఉంటాను. ఏవో రెండు విజయాలు సాధించి జీవితాంతం దాకా వాటినే గొప్పలుగా చెప్పుకునే కేటగిరి కాదు నాది. నేను కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న మొదటి మహిళ కానే కాదనే వారు లేకపోలేదు. అయితే ఐఏఎఫ్‌ ప్రతిష్ఠను కాపాడుతున్నట్లు చెప్పే కొందరు కార్గిల్‌ యద్దం తర్వాత 1999 వాయుసేన దృక్పథంలోని సాధికారతనే ప్రశ్నించడం ఎంతవరకు న్యాయం.‘ అంటూ గుంజన్‌ తెలిపారు.

వాయుసేన తన విజయాలను మీడియా ముందు చెప్పేసిందని...అయినా కార్గిల్‌ యుద్ధంలో మహిళగా తాను సాధించిన విజయాలను ఎలా తోసిపుచ్చగలరని గుంజన్‌ ప్రశ్నించారు. తను శౌర్యచరక్ర గ్రహీతనని ఎక్కడా ప్రకటించుకోలేదని...సినిమా నిర్మాత, దర్శకులు అలాంటి ప్రకటనలు చేయలేదని గుంజన్‌ స్పష్టం చేశారు. అయితే కార్గిల్‌ యుద్ధానంతరం ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ పౌరసంస్థ తనకు శౌర్యవీర్‌ అనే అవార్డు ఇచ్చినట్లు తెలిపారు. అయితే మీడియాకు చెందిన కొందరు దీన్నే శౌర్యచక్రగా మార్చి ప్రచారం చేసినట్టున్నారు. కానీ సినిమా ప్రమోషన్‌ కోసం మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు గుంజన్‌ వివరించారు.

సినిమా విడుదలయ్యాక ఇంకొందరు లింగవివక్ష పదాన్ని తెరపైకి తెచ్చారని, కానీ ఐఏఎఫ్‌ చాలా పెద్ద సంస్థ దానిపై ఏ చిన్న మరక కూడా పడనీయదు. ఒక లింగవివక్షే కాదు ఏ యితర వివక్షల్ని కూడా అది దరిచేరనీయదు. పైగా తాను సర్వీస్‌ చేసినంత కాలం ఎలాంటి లింగవివక్ష ఎదుర్కోలేదని, కొలీగ్స్, ఉన్నతాధికారులు సాటి ఉద్యోగిగా తనకు చాలా స్వేచ్ఛా వాతావరణం కల్పించారని గుంజన్‌ సక్సేనా చెప్పారు.

అయితే వ్యక్తిగతంగా ఏ ఇద్దరి అనుభవాలు ఒకేలా ఉండవన్నారు. అసలు వివక్ష అనేది సంస్థాగతం కాదు కాబట్టే.. మహిళాధికారుల అనుభవాలు ఒకేలా ఉండవని తెలిపారు. వాయుసేనలో కొందరిలో ఉన్న దురభిప్రాయాలు, వివక్ష ధోరణులతో ఓ స్త్రీగా నేను పోరాడాను.. కానీ అది వ్యక్తిగా కానీ ఉద్యోగిగా మాత్రం కాదని తేల్చి చెప్పారు. అలాగే తన కెరీర్‌ ప్రారంభంలో మహిళలకు ప్రత్యేక వాష్‌రూమ్‌లు, దుస్తులు మార్చుకునే గదుల విషయంలోనూ తను ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు.

సర్వైవల్‌ కోర్సు సమయంలో ఒకే టెంటులో తన ుపురుషాధికారులతో ఉండేదాన్నని, రోజూ తెల్లారకముందే లేచి కాలకృత్యాలు తీర్చుకునే దాన్నని వివరించారు. ఉన్నత ఆశయం కోసం ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటివన్నీ చాలా చిన్న అంశాలని నా అభిప్రాయమన్నారు.

సినిమాలో అవాస్తవికాంశాలు గురించి ఓ సీనియర్‌ జర్నలిస్టు ప్రస్తావించినట్లు తెలిసింది. ఓ రకంగా నేనూ వాటిని అంగీకరిస్తాను. ఎందుకంటే కార్గిల్‌ యుద్ధ పర్యవసానాలు నాకు బాగా తెలుసు. అందుకే వాటిని నేను తోసిపుచ్చలేను, అలాగని అంగీకరించలేనని సక్సేనా అన్నారు. అయినా సినిమా అంటేనే ఓ స్ఫూర్తి కథనాల వేదిక. తన జీవన విధానం, తన స్వప్నాలు ఎలా సాకారమయ్యాయో వివరించేలా సినిమా తీశారని, అది కేవలం డాక్యుమెంటరీ కాదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కోరారు. ఈ సినిమా ఏవిధంగానూ వాయుసేన ప్రతిష్ఠను మసకబార్చే విధంగా లేదని గుంజన్‌ తెలిపారు.

ఈ సినిమా వల్ల తనో సెలిబ్రిటీగా మారానని పొంగిపోనని.. వాస్తవానికి ఈ సెలిబ్రిటీ పదమే ఓ వైరస్‌ లాంటిదని.. అయితే అది ఎప్పటికీ తన వ్యక్తిత్వాన్ని, తన విలువల్ని కబళించదని తెలిపారు. తను సైనిక దుస్తులు ధరించిన వారి మధ్యే పెరిగానని, తాను తన సోదరుడు ఇద్దరూ ఆర్మీ కెరీర్‌నే ఎంచకున్నట్లు వివరించారు. రిటైర్‌ అయ్యాక కూడా ఒక అధికారి భార్యగా వాయుసేన ఆవరణంలోనే జీవనం సాగించినట్లు ఉద్వేగంగా తెలిపారు. అందుకే ఆర్మీకి సంబంధించి ఎవరూ తనకు జ్ఞానబోధ చేయాల్సిన అవసరం లేదని నిశితంగా వ్యాఖ్యానించారు.

Next Story